ఏపీ మంత్రులకు వెరైటీ విన్నపాలు... అయిననూ వినవలే...!
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల చుట్టూ ఇలాంటి విన్నపాలు.. అభ్యర్థనలు గుట్టలుగుట్టలుగా పేరుకు పోయాయి.
By: Tupaki Desk | 7 Aug 2023 4:55 AM"మేడం ఇదీ.. సమస్య.. కొంచెం త్వరగా పూర్తి చేయండమ్మా"- గుంటూరుకు చెందిన మంత్రికి వైద్యుల మొర.
"మేడం.. చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాం. ఈసారైనా.. నా భార్య ఉన్న చోటకు పంపించండి ప్లీజ్"- ఉమ్మడి పశ్చిమ గోదావరికి చెందిన మంత్రి వర్యులకు ఉద్యోగుల విన్నపాలు.
"సార్.. మీరు వచ్చారు. చాలా బాగుంది. శాఖలో పనులు పరుగులు పెడుతున్నాయి. కానీ, నా సమస్య కొంచెం పరిష్కరించండి''- ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన మంత్రికి వైసీపీ నాయకుడి విన్నపాలు.
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల చుట్టూ ఇలాంటి విన్నపాలు.. అభ్యర్థనలు గుట్టలుగుట్టలుగా పేరుకు పోయాయి. వీటిలో సొంత పార్టీ వైసీపీ కీలక నాయకుల నుంచి ఉద్యోగులు, స్థానిక ప్రజానీకం, సామాజిక వర్గాలకు చెందిన కీలక నాయకులకు చెందిన సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని కూడా మంత్రులకు ఉంది. ఎందుకంటే..ఎన్నికల నామ సంవత్సరం వచ్చేసింది.
సో.. ఎవరితో ఏ అవసరం ఉంటుందో.. ఎవరి కారణంగా.. ఏఓటు పోతుందో అనే బెంగ, భయం రెండు కూడా.. మంత్రుల్లో కనిపిస్తోంది. కానీ, వారికి చేయాలని ఉన్నా.. ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కరించా లని ఉన్నా.. అచేతనంగా వారు మారిపోయారు.
దీనికి కారణం.. 'పైనుంచి' ఆదేశాలు లేకపోవడమేనని అంటున్నారు. దీంతో మంత్రులు ఏమీ చేయలేక.. చూద్దాం.. చేద్దాం.. అంటూ సమయం సాగదీస్తున్నారు.
నిజానికి పై నుంచి అంటే.. ముఖ్యమంత్రి నుంచా..? లేక కీలక సలహాదారు నుంచా? అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ఎలా చూసుకున్నా.. ఎన్నికల సమయంలోనూ వారికి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం కానీ.. ఆదేశించే అవకాశం కానీ.. లేక పోవడం గమనార్హం.
రాష్ట్రంలో కొన్ని కీలక శాఖలకు మంత్రులు ఉన్నా.. ఏ ఒక్కపనీ ముందుకు సాగడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో అందరూ కూడా నిమిత్తమాత్రులేనని.. సర్వం.. జగన్నాథమేనని కామెంట్లు వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.