వీడియో వైరల్: ఫస్ట్ చెంపదెబ్బ తిను.. నెక్స్ట్ రెస్టారెంట్ లో ఫుడ్ తిను!
ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొంటే లీటర్ కూల్ డ్రింక్ ఫ్రీ ఆఫర్ కాదు సుమా... ఆ రెస్టారెంట్ లో ఫుడ్ రుచి చూడాలంటే అంతకంటే ముందు డబ్బులిచ్చి మరీ చెంపదెబ్బలు రుచి చూడాలి.
By: Tupaki Desk | 7 Dec 2023 3:45 AM GMTఈ టైటిల్ చూసి ఎవరికైనా అనుమానం రావొచ్చు! రెస్టారెంట్ లో ఫుడ్ తినాలంటే ముందు చెంపదెబ్బ కొట్టించుకోవాలా అని? అవును... ఇది అక్షరాలా నిజం! పైగా ఈ రెస్టారెంట్ కు జనం తెగ ఎగబడుతున్నారంట. ఇందులో చెంపదెబ్బలకు కూడా ధరల పట్టిక ఉండటం గమనార్హం. అసలు ఏమిటీ రెస్టారెంట్ స్పెషాలిటీ, ఎక్కడ ఉంది ఇది అనేది ఇప్పుడు చూద్దాం!
అవును... జపాన్ లోని డి నగోయా అనే నగరంలో ఉన్న షాచిహోకో యా ఇజాకాయా అనే రెస్టారెంట్... తమ కస్ట్ మర్స్ కోసం సరికొత్త ఆఫర్ పెట్టింది. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొంటే లీటర్ కూల్ డ్రింక్ ఫ్రీ ఆఫర్ కాదు సుమా... ఆ రెస్టారెంట్ లో ఫుడ్ రుచి చూడాలంటే అంతకంటే ముందు డబ్బులిచ్చి మరీ చెంపదెబ్బలు రుచి చూడాలి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఈ హోటల్ బయట ఓ బోర్డు కనిపించింది. అదేమిటంటే... తమ హోటల్ కు వచ్చిన ప్రతి ఒక్కరినీ చెంప దెబ్బలు కొడతామని! ఇదే సమయంలో తమకు కావల్సినట్లు చెంపదెబ్బలు కొట్టించుకోవాలనుకునేవారు రూ.150 (2 డాలర్లు ) నుంచి రూ. 300 (3.5 డాలర్లు) వరకు చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా రాసింది. దీంతో జనం ఎగబడుతున్నారంట.
దీంతో ఈ విషయం తెలిసిన వారు... “ఇదేమి ఆఫర్ రా సామీ” అని ఆశ్చర్యపోతుంటే... మరోపక్క కొంతమంది కస్ట్ మర్స్ మాత్రం ఈ హోటల్ కి పోటెత్తుతున్నారంట. ఇలా పోటెత్తినవారి కోసం జపాన్ సంప్రదాయ దుస్తుల్లో ఉండే అందమైన వెయిట్ రెస్.. రెస్టారెంట్ ఎంట్రన్స్ లో నుంచుని ఉంటున్నారు. వచ్చిన వారందరినీ కావాల్సినన్ని సార్లు చెంప దెబ్బలు కొడుతున్నారు.
ఇలా ఈ చెంపదెబ్బల రెస్టారెంట్ కు క్యూ కడుతున్నవారిలో స్వదేశీయులే కాకుండా విదేశీయులూ కూడా ఉన్నారని అంటున్నారు. వారిలో కొందరు మీడియాతో మాట్లాడుతూ.. ఆ దెబ్బలు తిన్న తర్వాత తమ ఒత్తిడి ఎగిరిపోయిందని చెబుతూ... "చాలా రిలాక్స్ గా ఉంది మాస్టారూ" అని చెబుతున్నారంట. మరికొంతమంది ఇదొక వింత అనుభవమని చెప్పుకొస్తున్నారంట.
ఈ సమయంలో ఈ చెంపదెబ్బలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక అధికారులు ఆ రెస్టారెంట్ ను హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ "స్పెషల్" సేవలను నిలిపివేయాలని హెచ్చరించారు. సున్నితంగా ఉండే చెవి ప్రాంతంలో ఈ చెంప దెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్న కారణంతో అధికారులు గట్టిగానే హెచ్చరించారని అంటున్నారు.
దీంతో ఇకపై ఈ చెంప దెబ్బల సేవలు నిలిపివేశామని, వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సదరు రెస్టారెంట్ యాజమాన్యం ఎక్స్ లో ప్రకటించింది. దీంతో చాలామంది కస్ట్ మర్లు "అయ్యో..." అంటూ తెగ ఫీలైపోతూ ఆన్ లైన్ లో విచారంగా స్పందిస్తున్నారంట.