Begin typing your search above and press return to search.

హెలికాప్టర్ లోనూ ‘పేజర్’ పేలుడు.. అందుకే ఆ దేశాధ్యక్షుడి మరణం

ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తరచూ ఇజ్రాయెల్, అమెరికాలపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తుండేవారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 6:41 AM GMT
హెలికాప్టర్ లోనూ ‘పేజర్’ పేలుడు.. అందుకే ఆ దేశాధ్యక్షుడి మరణం
X

ఆయనో శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు. పైగా అణు సామర్థ్యం కలిగిన దేశం.. అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న దేశం.. అమెరికాకు ఆగర్భ శత్రువు కూడా.. అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే.. భద్రత మామూలుగా ఉండదు కదా.. ఇక ఆ ప్రాంతమంతా తీవ్ర స్థాయి ఘర్షణలతో ఉద్రిక్తంగా మారిన సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా పెద్ద సంచలనమే.. అలాంటిది ఏకంగా దేశాధ్యక్షుడే చనిపోయారు.. దీనివెనుక ఎవరున్నారు? ఆయన పదవిపై కన్నేసిన పార్టీ నేతలా..? లేక శత్రు దేశ భద్రతా దళాలా..? లేక కేవలం ప్రమాదమా..? అనే చర్చ ప్రపంచాన్ని కుదిపేసింది. అయితే, దీనికి సమాధానం దొరకలేదు కానీ.. కీలక విషయం బయటపడింది.

ఆ కొండల్లో.. కూలింది అందుకేనా

ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తరచూ ఇజ్రాయెల్, అమెరికాలపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తుండేవారు. ఓవైపు హమాస్ తో ఇజ్రాయెల్ యుద్ధం సాగుతున్నవేళ హమాస్ కు అండగా నిలిచే ఆయన అనూహ్యంగా మే నెలలో హెలికాప్టర్ కూలడంతో ప్రాణాలు కోల్పోయారు. అజర్‌ బైజాన్‌ సరిహద్దు కొండల్లో ఓ ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. అప్పట్లో వాతావరణం బాగోలేకనే ఈ దుర్ఘటన జరిగిందని అంతా భావించారు. ఇజ్రాయెల్‌ చేసిన పని అని కూడా చాలామంది అనుమానించారు. కానీ, ఏ ఆధారాలూ దొరకలేదు.

ఆయన పేజర్ వాడారు..

లెబనాన్‌ లో గత మంగళవారం వరుసగా పేజర్లు పేలాయి. ఆ తర్వాత వాకీటాకీలు పేలాయి. దీంతో 700 మందికి పైగా చనిపోయినట్లు తేలింది. వేలాది మంది గాయపడ్డారు. దీంతో పేజర్ల వాడకం చర్చనీయాంశమైంది. ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ చేసిన పని ఇదని అందరికీ తెలిసింది. ఇలాంటి సమయంలో ఇరాన్‌ ఎంపీ అహ్మద్ అర్దెస్తానీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం-పేజర్ల పేలుళ్లను ముడిపెట్టారు. రైసీ కూడా పేజర్‌ వాడేవారని తెలిపారు. ఆ మేరకు ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తాజాగా ఇరాన్‌ ఎంపీ వ్యాఖ్యలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

వీరు పేల్చేశారు..

అంతా బాగుండి రైసీ హెలికాప్టర్ కూలడం వెనుక కారణం పేజర్ పేలుడు అనే అభిప్రాయం వినిపిస్తోంది. రైసీ పేజర్‌ వాడేవారని.. అయితే హెజ్బొల్లాల కంటే ఇది మెరుగైన పేజర్ అని తెలుస్తోంది. అధ్యక్షుడు కాబట్టి భద్రతా ఫీచర్లు మెరుగ్గా ఉండొచ్చు. కొసమెరుపు ఏమంటే.. హెజ్‌బొల్లా పేజర్ల కొనుగోళ్లలో ఇరాన్‌ దే కీలక పాత్ర. అంటే.. తమ మిత్రులకు తామే మరణ శాసనం రాసిందన్నమాట.