ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆవు పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆవు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 1 Oct 2024 12:30 AM GMTభారతదేశంలో అవుని ఎంత పవిత్రంగా చూస్తారనేది తెలిసిన విషయమే. ఆవుని "గోమాత" అని పిలుస్తారు అంటేనే ఆవుకి ఇక్కడ ఇచ్చే గౌరవం ఏ స్థాయిలో ఉంటుందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆవు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆవును "రాజ్యమాత" గా ప్రకటించింది.
అవును.. ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... భారతీయ సంప్రదాయంలో ఆవుకున్న ప్రాధాన్యతకు గుర్తింపుగా ఇకపై ఆవును "రాజ్యమాతగా" గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో... దేశవాళీ ఆవుల సంఖ క్రమేపీ తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
దేశ ఆధ్యాత్మిక, శాస్త్రీయ, మిలటరీ చరిత్రను తీసుకున్నా.. గోమాతకు కీలక పాత్ర ఉందని, పురాతన కాలం నుంచి గోవును పూజిస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో... వ్యవసాయంలో ఆవు పేడ ప్రాధాన్యతను కూడా ఆ ప్రకటనలో వివరించింది.
ఆవు పాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయని.. ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని వివరించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇదే క్రమంలో... పశువుల పెంపకందార్ల సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని వారిని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపీంది.
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించనున్న నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీపావళి పండుగ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 26తో ముగియనుంది.