Begin typing your search above and press return to search.

ఏపీలో మరో కుంభకోణం.. రూ.36.53 కోట్ల ఈ-చలానాల సొమ్ము స్వాహా!

ఈ–చలానాల రూపంలో చెల్లించిన మొత్తం కొమ్మారెడ్డి అవినాశ్‌ కు చెందిన రేజర్‌ పీఈ ఖాతాకు మళ్లించుకున్నట్లు వెల్లడైంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 8:01 AM GMT
ఏపీలో మరో కుంభకోణం.. రూ.36.53 కోట్ల ఈ-చలానాల సొమ్ము స్వాహా!
X

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలో ట్రాఫిక్‌ ఈ–చలానాల రుసుముల వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డీజీపీ ఖాతాకు జమ కావాల్సిన రూ.36.53 కోట్ల ఈ–చలానాల సొమ్మును ఒక సాఫ్ట్‌ వేర్‌ సంస్థ నిర్వాహకుడు తన కంపెనీ తన సొంత ఖాతాకు బదిలీ చేసుకున్న వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో ఏపీ పోలీసు శాఖ స్పందించింది. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వాహనదారులు జరిమానాల రూపంలో చెల్లించిన ఈ–చలానాల సొమ్ము పక్కదారి పట్టినట్టు తెలిపారు. డేటా ఎవాల్వ్‌ సంస్థ సీఈవో ఇందులో కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. అతడి ఆస్తులను స్తంభింపజేయాలని, అమ్మకాలకు, కొనుగోళ్లకు తావివ్వద్దని రిజిస్ట్రేషన్ల శాఖను కోరామని చెప్పారు.

కాగా వాహనదారులు నిబంధనలు అతిక్రమించినప్పుడు వారికి జరిమానాలు విధిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాహనదారులు చెల్లించిన సొమ్ము నేరుగా డీజీపీ ఖాతాకు బదిలీ కావాల్సి ఉంది. అయితే ఆ ఖాతాకు కాకుండా డేటా ఎవాల్వ్‌ సంస్థ సంస్థ ఖాతాకు చేరిందని పోలీసులు గుర్తించారు.

ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి అపరాధ రుసుం ఈ–చలానాల రూపంలో డీజీపీ ఖాతాకు నాలుగు పేమెంట్‌ గేట్‌ వేల నుంచి జమవుతుంది. ఇందులో డేటా ఎవాల్వ్‌ సంస్థకు చెందిన రేజర్‌ పే ఖాతా నుంచి డీజీ ఖాతాకు నగదు జమయ్యేలా ఒప్పందం ఉంది. అయితే డేటా ఎవాల్వ్‌ సంస్థ తన సాఫ్ట్‌వేర్‌ లో రేజర్‌ పే యాప్‌ను క్లోనింగ్‌ చేసి రేజర్‌ పీఈ యాప్‌ను రూపొందించింది. ఆ సొమ్మును తమ సొంత ఖాతాకు జమయ్యేలా అక్రమాలకు పాల్పడిందని ఐజీ పాలరాజు తెలిపారు.

ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరులో తిరుపతి ట్రాఫిక్‌ డీఎస్పీ నర్సప్ప ట్రాఫిక్‌ చలానాల విషయంలో ఏదో మతలబు జరుగుతుందని గుర్తించి ఉన్నతాధికారుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 31న దర్యాప్తు ప్రారంభించారు. రేజర్‌ పే ఖాతా నుంచి డీజీ ఖాతాకు నగదు వెళ్లడం లేదని విచారణలో తేలింది. వాహనదారులు ఈ–చలానాల రూపంలో చెల్లించిన మొత్తం కొమ్మారెడ్డి అవినాశ్‌ కు చెందిన రేజర్‌ పీఈ ఖాతాకు మళ్లించుకున్నట్లు వెల్లడైంది.

కాగా 2017 జూన్‌ 27న కొమ్మారెడ్డి అవినాశ్‌ కు చెందిన డేటా ఎవాల్వ్‌ సొల్యూషన్స్‌ కు ఈ–చలానాల సర్వీస్‌ ప్రొవైడర్‌ బాధ్యతలు అప్పగించారని ఐజీ పాలరాజు తెలిపారు. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ లో ఒక్క రూపాయికే కోట్‌ చేసి, టెండరు దక్కించుకున్న ఆ సంస్థ నిర్వాహకులు.. డీజీపీ ఖాతాకు జమ కావాల్సిన నగదులో రూ.36.53 కోట్లను తమ సంస్థ సొంత ఖాతాల్లోకి బదలాయించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.36.53 కోట్లు దుర్వినియోగమైందని గుర్తించామని గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు వెల్లడించారు. కొమ్మారెడ్డి అవినాశ్‌ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని తెలిపారు. అవినాశ్‌ కు చెందిన డేటా ఎవాల్వ్‌ సంస్థ ఆస్తులను గుర్తించి వాటి క్రయవిక్రయాలకు తావులేకుండా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు లేఖలు రాశామని చెప్పారు.

ఒకేసారి అందర్నీ అరెస్టు చేస్తే మోసం జరిగిన తీరు, ఈ ఆదాయాన్ని ఎక్కడ దాచిపెట్టారు? వాటితో ఏ ఆస్తులు కొన్నారనే వివరాలు తెలియవని అందుకే కేసు విచారణ విషయంలో గోప్యత పాటించామని ఐజీ పాలరాజు తెలిపారు. అన్ని వివరాలు తెలిశాక అవినాశ్‌ తో పాటు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న అతని సోదరి అక్షిత, రవికిరణ్‌ లను బాధ్యులుగా గుర్తించి కేసు పెట్టామన్నారు. వారందరిపైనా నిఘా పెట్టామని, త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. దుర్వినియోగమైన రూ.36.53 కోట్లు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది, వాటి ద్వారా ఏఏ ఆస్తులు కొనుగోలు చేశారనేది గుర్తించి వాటిని జప్తు చేశామన్నారు. డేటా ఎవాల్వ్‌ సంస్థను పోలీసు శాఖకు పరిచయం చేసిన రాజశేఖర్‌ కొత్తపల్లిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు చెప్పారు.

కాగా ఈ కేసులో గుంటూరు పోలీసులు మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో డేటా ఎవాల్వ్‌ సంస్థ మేనేజర్‌ రాజశేఖర్‌ ను మాత్రమే ఇప్పటివరకు తమ అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడైన సంస్థ సీఈవో అవినాష్, అతని సోదరి, సంస్థ డైరెక్టర్‌ అక్షిత, మరో డైరెక్టర్‌ రవికిరణ్, తదితరులు పరారీలో ఉన్నారు.