Begin typing your search above and press return to search.

హ‌రియాణాలో 10 వేల మంది శ‌తాధిక ఓట‌ర్లు.. త‌ల ప‌ట్టుకున్న ఎన్నికల సంఘం

ఏయే వ‌య‌సుల వారు ఎంతెంత మంది ఉన్నార‌నే లెక్క‌లు తీయడం ప్రారం భించింది

By:  Tupaki Desk   |   22 Aug 2024 2:30 AM GMT
హ‌రియాణాలో 10 వేల మంది శ‌తాధిక ఓట‌ర్లు.. త‌ల ప‌ట్టుకున్న ఎన్నికల సంఘం
X

ప్ర‌స్తుతం జ‌మ్ముక‌శ్మీర్‌, హ‌రియాణ రాష్ట్రాల‌లోని అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దీని ప్ర‌కారం జ‌మ్ము క‌శ్మీర్‌లోని 90 స్థానాల‌కు మూడు ద‌శ‌ల్లోనూ, హ‌రియాణలోని 90 అసెంబ్లీ స్థానాల‌కు ఏక కాలంలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. హ‌రియాణాలో అక్టోబ‌రు 1న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల జాబితాపై దృష్టి పెట్టింది. ఏయే వ‌య‌సుల వారు ఎంతెంత మంది ఉన్నార‌నే లెక్క‌లు తీయడం ప్రారం భించింది. ఈ క్ర‌మంలో ఓ సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది.

100 ఏళ్ల వ‌య‌సు దాటిన(శ‌తాధికులు) ఓట‌ర్లు 10 వేల మందికి పైగా ఉన్నార‌ని హ‌రియాణా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు గుర్తించారు. స‌హ‌జంగా శ‌తాధిక వృద్ధులు మ‌హా ఉంటే.. ఏ రాష్ట్రంలో అయినా.. ఓ వెయ్యి.. లేదా రెండువేల‌కు మించ‌రు. పోనీ.. ఆ రాష్ట్ర ప‌రిస్థితులు, ప‌ర్యావ‌ర‌ణం వంటివి దృష్టిలో పెట్టుకుని.. ఇంకా ఆరోగ్యంగా ఉన్నార‌ని అనుకున్నా.. 3 వేల మందికి అయి తే మించ‌రు. అలాంటిది హ‌రియాణాలో ఏకంగా.. 9,554 శ‌తాధిక వృద్ధులు ఉన్న‌ట్టు ఎన్నిక‌ల జాబితాల్లో న‌మోదైంది. ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన హ‌రియాణ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి పంక‌జ్ అగ‌ర్వాల్‌.. సందేహాలు వ్య‌క్తం చేశారు.

ఒక రాష్ట్రంలో ఇంత మంది 100 ఏళ్లు దాటిన వారు ఉంటారా? అంటూ.. ఆయ‌న ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తూ.. పొరుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేయించారు. దీంతో హ‌రియాణాకు పొరుగున ఉన్న పంజాబ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల ఓట‌ర్ల జాబితాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌ర్వాత‌.. ఆయా రాష్ట్రాల్లోనూ 100 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన ఓట‌ర్లుఉన్నార‌ని.. అయితే.. వారి సంఖ్య అత్య‌ల్పంగానే ఉంద‌ని గుర్తించారు. పంజాబ్‌లో 4,116 మంది హిమాచల్ ప్రదేశ్‌లో 1,216 మంది వందేళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారని గుర్తించారు.

దీంతో అలెర్ట‌యిన‌.. హ‌రియాణా ఎన్నిక‌ల అధికారులు రాష్ట్రంలో న‌మోదైన ఓట‌ర్ల జాబితాను ప్రక్షాళ‌న చేయాల‌ని.. అంత మంది శ‌తాధిక వృద్ధులు నిజంగానే ఉన్నారో.. లేరో తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించింది. అసాధార‌ణ రీతిలో శ‌తాధిక వృద్ధులు క‌నుక ఉండి ఉంటే.. హ‌రియాణా నిజంగానే రికార్డుల‌కు ఎక్కుతుంది. లేక‌పోతే.. ఎక్క‌డ పొర‌పాటు దొర్లిందో తెలుసుకుని దానిని స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే శతాధిక వృద్ధుల జాబితాల‌ను తిరిగి నిర్ధారించే ప‌నిలో ప‌డ్డారు. చివ‌ర‌కు ఏం తేలుస్తారో చూడాలి.

ఎలా జ‌రిగి ఉంటుంది?

+ ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ 22 మంది శతాధిక వృద్ధులు ఉన్న‌ట్టు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గుర్తించింది. అయితే.. దీనిపై సందేహాలు రావ‌డంతో.. ఆయా అడ్ర‌స్‌లు, ఆధార్ నెంబ‌ర్ల ప్ర‌కారం.. వివ‌రాలు సేక‌రించ‌గా.. వారిలో కేవ‌లం 8 మంది మాత్ర‌మే జీవించి ఉన్న‌ట్టు గుర్తించారు. దీంతో అప్ప‌టికప్పుడు మార్పులు చేసుకున్నారు. చ‌నిపోయిన వారి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నందున‌, వారిని ఓటర్ల జాబితా నుంచి తొల‌గించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. అందుకే తేడా కొట్టింద‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు పేర్కొన్నారు.