Begin typing your search above and press return to search.

రైతుబంధుకు ఈసీ ఓకే.. డబ్బులు ఎప్పుడు పడనున్నాయంటే?

కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. షెడ్యూల్ లో భాగంగా రైతుబంధు పైసలు అకౌంట్లో వేసేందుకు ఓకే చెప్పేసింది ఈసీ.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:45 AM GMT
రైతుబంధుకు ఈసీ ఓకే.. డబ్బులు ఎప్పుడు పడనున్నాయంటే?
X

కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. షెడ్యూల్ లో భాగంగా రైతుబంధు పైసలు అకౌంట్లో వేసేందుకు ఓకే చెప్పేసింది ఈసీ. యాసంగి సీజన్ కోసం రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతులు జారీ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే.. ఈ చెల్లింపులకు సంబంధించిన టైం లైన్ ఇవ్వటం గమనార్హం. ఈ నెల 28న అంటే.. పోలింగ్ కు రెండు రోజులకు ముందే డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేయాల్సి ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది.

ప్రతి ఏడాది ఒక్కో సీజన్ కు ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వ పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలోకి వేయటం తెలిసిందే. రెండు సీజన్లకు కలిపి మొత్తం రూ.10వేలను రైతుల ఖాతాలోకి నేరుగా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్ కు నిదుల జమ జరగలేదు. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతున్న పథకమని.. కోడ్ వర్తించదని.. ఈ సాయం విడుదలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాగా.. తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంది.

28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తున్నందున. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్ ముగిసే వరకు నిధుల్ని జమ చేయొద్దని పేర్కొన్న ఈసీ.. అంతకు ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి శనివారం నుంచి సొమ్ము జమ చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే.. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే.. సరిగ్గా పోలింగ్ కు ఐదారు రోజుల ముందు అకౌంట్లోకి డబ్బులు వేసేందుకు వీలుగా అనుమతి తీసుకోవటం ఏమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. మరోవైపు.. రైతుబంధు సాయం అమలుకు ఈసీ ఓకే చెప్పటంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కమ్ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ విడుదలకు సైతం ఈసీ ఓకే చెప్పాలని కోరారు. మరేం జరుగుతుందో చూడాలి.