ఇప్పుడు కేటీఆర్ వంతు.. ఏం సమాధానం చెబుతారో!
ఇక, తాజాగా కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌కు కూడా.. ఇదే తరహాలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తాఖీదు అందింది.
By: Tupaki Desk | 26 Nov 2023 6:19 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో అన్నట్టుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం ఒకవైపు. అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న తప్పులపై నిశిత దృష్టిపెట్టి కొరడా పట్టుకుని చర్యలకు సిద్ధమైన ఎన్నికల సంఘం మరో వైపు. ఇదీ.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులను, పార్టీలను కలవర పెడుతు న్న అంశం. మరో మూడురోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి గడువు ఉండగా.. పార్టీలు, నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు.
అయితే.. అభ్యర్థులు చేస్తున్న ప్రచారం, వారు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా నిఘా పెట్టింది. అదేసమయంలో వారిపై వస్తున్న ఫిర్యాదులను కూడా సీరియస్ గానే తీసుకుంటోంది. రెండు రోజుల కిందట సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌కే కేంద్ర ఎన్నికల సంఘం మందలింపు లేఖ సంధించింది. హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై విమర్శలు చేసి.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం పట్ల.. సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈసారి ఇలా జరిగితే.. పార్టీనే మూసేస్తామని హెచ్చరించింది.
ఇక, తాజాగా కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌కు కూడా.. ఇదే తరహాలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తాఖీదు అందింది. అయితే.. ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు కానీ, ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ భవనాన్ని వినియోగించుకున్నారనేది ఆరోపణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హైదరాబాద్‌లో ని టీవర్క్స్‌లో ఉద్యోగులతో కేటీఆర్ భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు వారికి రాష్ట్ర అభివృద్ధి ని వివరించారు. మరోసారి కేసీఆర్ను ఎందుకు ఎన్నుకోవాలో వివరించారు.
ఈ క్రమంలోనే ఆయన 'టీవర్క్స్' ఆఫీస్‌లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల వేళ.. యువతను.. అన్నివర్గాల వారినీ ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విషయంలో కేటీఆర్‌ను తప్పుపట్టాల్సిన పనిలేదు. ఈసీ కూడా తప్పుబట్టలేదు. కానీ, ఆయన ఎంచుకు న్న ప్రాంతమే ఇప్పుడు రగడకు దారితీసింది.
టీవర్క్స్ భవనం.. ప్రభుత్వానికి చెందిన బిల్డింగ్ కావడంతో అక్కడ ఉద్యోగులతో భేటీపై కాంగ్రెస్ జాతీయ నేత రణదీప్‌సుర్జేవాలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఆదివా రం(ఈ నెల 26)లోగా దీనిపై వివరణ ఇవ్వాలని.. లేక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి దీనిపై కేటీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.