Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు ఈసీ నోటీసులు.. రీజ‌న్ ఇదే!

ఇక‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, విజ‌య వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు.. మంగ‌ళ‌వారం.. ప‌వ‌న్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లిఖిత పూర్వ‌క ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   10 April 2024 6:57 PM GMT
ప‌వ‌న్‌కు ఈసీ నోటీసులు.. రీజ‌న్ ఇదే!
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి(సీఈవో) నోటీసులు జారీ చేశారు. సీఎం జ‌గ‌న్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి(కోడ్‌)కి విరుద్ధంగా ఎందుకు విమ‌ర్శ‌లు చేశార‌ని ప్ర‌శ్నించారు. దీనిపై 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సీఈవో ముఖేష్‌కుమార్ మీనా పేర్కొన్నారు. ఇక‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, విజ‌య వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు.. మంగ‌ళ‌వారం.. ప‌వ‌న్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లిఖిత పూర్వ‌క ఫిర్యాదు చేశారు. సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల తాలూకు రికార్డుల‌ను కూడా అప్ప‌గించారు. దీంతో మీనా ఈ మేర‌కు నోటీసులు ఇచ్చారు.

ఏం జ‌రిగింది?

రెండు రోజుల కింద‌ట‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స్థానంలో కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. అన‌కాప‌ల్లి అసెంబ్లీ అభ్య‌ర్థిగా జ‌న‌సేన నాయ‌కుడు కొణతాల రామ‌కృష్ణ పోటీ చేస్తున్నారు. అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా బీజేపీ నేత సీఎం ర‌మేష్ బ‌రిలో ఉన్నా రు. వీరిద్ద‌రి త‌ర‌ఫున ప‌వ‌న్ ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కుంభ‌కోణాల పితామ‌హుడు(స్కామ్ స్ట‌ర్‌) అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా భూములు లాక్కునే వ్యక్తి, ఇసుక-మద్యం సామ్రాజ్యానికి అధినేత అని విరుచుకుప‌డ్డారు. దీంతో ఈ వ్యాఖ్య‌ల‌ను వైసీపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకువెళ్లింది.

కామ‌న్‌?

కాగా, టీడీపీ-జ‌న‌సేన‌-వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సీఎం జ‌గ‌న్ దుర్మార్గుడు, దుష్టుడు, భ‌స్మాసురుడు, సైకో అంటూ చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, చంద్ర‌బాబును ప‌శుప‌తి, ల‌క‌ల‌క, వెన్నుపోటు వీరుడు అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు సీఎం జ‌గ‌న్‌. అదేవిధంగా ప‌వ‌న్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. అయితే.. కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల కూడా ఇలానే సీఎం జ‌గ‌న్పై విరుచుకుప‌డుతున్నారు. కానీ, ఆమెపై మాత్రం వైసీపీ చూసీచ‌డ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. మొత్తానికి ఎవ‌రైనా అంద‌రూ ఆ తాను ముక్క‌ల‌నే త‌ల‌పిస్తుండ‌డం గ‌మ‌నార్హం.