Begin typing your search above and press return to search.

తెలంగాణా ఆదాయం అది...ఏపీకి ఎన్ని కష్టాలో ?

పదేళ్ల క్రితం రెండుగా విడిపోయిన ఏపీ ఆంధ్రాలలో ఆదాయం లెక్కలు చూస్తే విభ్రాంతిని కలిగించేలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 Feb 2025 3:53 AM GMT
తెలంగాణా ఆదాయం అది...ఏపీకి ఎన్ని కష్టాలో ?
X

ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఆర్థిక ఆరోగ్యం బాగుంది అన్నది అంచనా కట్టాలీ అంటే ముందుగా చూడాల్సింది వచ్చే రాబడిని. అలా రాబడి అధికంగా వచ్చి ఖర్చు పరిమితులకు లోబడి ఉంటే ఆ రాష్ట్రం బాగా ఉన్నట్లుగా ఆర్థిక వేత్తలు అంచనా వేసుకుంటారు.

పదేళ్ల క్రితం రెండుగా విడిపోయిన ఏపీ ఆంధ్రాలలో ఆదాయం లెక్కలు చూస్తే విభ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. విడిపోయేనాటికి భారీ రెవిన్యూ లోటుతో ఏపీ ఉంది. పైగా ఏపీకి హైదరాబాద్ లాంటి రాజధాని అన్నది లేనే లేదు. రాబడిని తెచ్చే సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్, ఐటీ సెక్టార్లు కూడా లేవు.

దాంతో ఏపీ అప్పులల్లోకి వెళ్ళిపోయింది. ఏపీకి ఎవరు సీఎం గా ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా ఇది తప్పని తంతుగా మారుతోంది. దానికి కారణం సరైన రాబడి లేకపోవడమే. మరి సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణా ఆదాయం ఎందుకు తగ్గిపోతోంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. తెలంగాణాలో చూస్తే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇచ్చిన లెక్కలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రతీ నెలా వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు తేడా ఉందని అంటున్నారు.

నెలకు తెలంగాణాకు 22,500 కోట్ల రూపాయలు అవసరం ఉంటే ప్రస్తుతం వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు మాత్రమే అన్నది ముఖ్యమంత్రి తేల్చిన లెక్కగా ఉంది. ఇక ఇందులో జీతాలకు 6,500 కోట్ల రూపాయలు పోతాయి. అలాగే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కింద చెల్లించాల్సిన మొత్తాలు 6,800 కోట్ల రూపాయలు ప్రతీ నెలా ఉంటాయి. దాంతో నెలవారీగా చూస్తేనే తెలంగాణాకు నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం లోటుగా కనిపిస్తోంది.

ఇలా ఏడాదికి లెక్క కడితే అచ్చంగా యాభై వేల కోట్ల రూపాయల మేర లోటు అన్న మాట. అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పనులకు ఖర్చు చేయాలీ అంటే మరిన్ని అప్పులు చేయాల్సిందే అని అంటున్నారు. ఆదాయాలను పెంచే మార్గాలని అన్వేషిస్తున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఆదాయం పెరుగుతూ ఉంటే ఖర్చులు దానితో పాటే పెరుగుతూనే ఉంటాయి.

అలా తెలంగాణా ఆర్ధిక ఇబ్బందులో ఉంది. ఒక సీఎం స్వయంగా చెప్పిన విషయం ఇది అయితే ఏపీలో ఎన్నో రంగాల మీద బ్లూ ప్రింట్లు విడుదల చేశారు. ఆదాయం లేదని అన్నారు గతసారి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లోనూ అప్పులు తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల దాకా ఉన్నాయని అన్నారు.

ఇపుడు చూస్తే కనుక బడ్జెట్ లో ఏ విధంగా ఈ అప్పులు చూపిస్తారో ఆదాయాలు ఎలా చెబుతారో అన్న ఆసక్తి ఉంది. వీటిని పక్కన పెడితే ఒక సంపన్న రాష్ట్రంగా 2014లో ఆవిర్భవించిన తెలంగాణాకే అప్పులు ఉంటే ఏపీకి ఎన్ని కష్టాలో కదా అన్న చర్చ అయితే ఉంది. అప్పులకు వడ్డీలే నడ్డి విరుస్తున్న నేపథ్యంలో అభివృద్ధికి నిధులు ఎక్కడా వాటి కోసం తెచ్చే అప్పులు వాటికి కట్టే వడ్డీలతో ఏపీ ఎప్పటికి ఎత్తిగిల్లుతుంది అన్నది రాష్ట్రం కోసం ఆలోచించేవారి అందరి మనసులో ఉన్న మాట.

ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు విభజన తరువాత అప్పుల ఊబిలోకి వెళ్ళడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి సంకేతాలు అన్న నినాదానికి ఇది విరుద్ధంగానే ఉంది. రానున్న రోజులలో ఏమైనా ఈ రాష్ట్రాలు కోలుకుంటాయేమో చూడాల్సి ఉంది.