లో దుస్తుల అమ్మకాలకు.. ఆర్థిక మాంద్యానికి ఇంత కథ ఉందా?
మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం అంత గొప్పగా లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు
By: Tupaki Desk | 15 Sep 2023 5:30 PM GMTమన ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం అంత గొప్పగా లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరుగుతోంది. దీంతో ఆర్థిక మందగమనంతోపాటు ఆర్థిక మాంద్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ బ్యాంక్ తోపాటు ఇతర రేటింగ్ ఏజెన్సీలు సైతం భారత్ వృద్ధిరేటును వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతానికి తగ్గించాయి. కేవలం మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నారు.
చాలా మంది ఆర్థికవేత్తలు ఆర్థిక మాంద్యం సమయంలో ప్రజలు ఖరీదైన, అనవసరమైన వస్తువులను తగ్గించుకుంటారని నమ్ముతారు. అమెరికా మాజీ ఫెడరల్ రిజర్వ్ హెడ్... అలాన్ గ్రీన్‌స్పాన్ ఆర్థిక మాంద్యం వచ్చిందనడానికి పురుషుల లోదుస్తులు అమ్మకాలు పడిపోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక సూచిక అని అభిప్రాయపడ్డారు.
లో దుస్తులు (ఇన్నర్‌వేర్స్)ని ఎవరూ చూడరు. అందువల్ల డబ్బులు తక్కువ ఉన్నప్పుడు లో దుస్తులు కొనడానికి ప్రజలు ఇష్టపడరంట. ఎందుకంటే అవి ధరించామా, లేదా అనేది ఎవరూ చూడరు, తెలుసుకోలేరు కాబట్టి.
చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు అనవసరమైన వస్తువులను కొనడం ప్రజలు తగ్గించుకుంటారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా లో దుస్తులు కొనడం తగ్గించుకుంటారని.. ఉన్నవాటితోనే సరిపెట్టుకుంటారని అంటున్నారు.
దీంతో లో దుస్తులను ఉత్పత్తి చేసే కంపెనీల విక్రయాలు తగ్గిపోతాయి. ఇలా లో దుస్తుల విక్రయాలు తగ్గినప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్టు భావిస్తారు.
మనదేశంలో గతేడాది మార్చిలో లో దుస్తులను తయారుచేసే జాకీ, లక్స్ ఇండస్ట్రీస్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీన్ని బట్టి మనదేశంలోనూ మాంద్యం ప్రవేశించినట్టేనని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కేవలం మనదేశంలోనే కాదు అమెరికాలో 2007–09 మధ్య ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఆ దేశంలో సైతం లో దుస్తులు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. సాధారణ ఆర్థిక సమయాల్లో లోదుస్తుల అమ్మకాలు గణనీయంగా ఉంటాయట.
తాజాగా పండుగల సీజన్ వచ్చేసింది. కొద్ది రోజుల్లో వినాయకచవితి నుంచి పండుగలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త బట్టల కోసం షాపులకు వెళ్తున్నా లో దుస్తులు, ఇన్నర్ వేర్ లు కొనడం లేదని అంటున్నారు. దీంతో లో దుస్తుల తయారీ కంపెనీలు.. జాకీ, డాలర్ ఇండస్ట్రీస్, రూపా వంటి ఇన్నర్ వేర్ ల విక్రయాలు పడిపోయాయంటున్నారు. పిల్లలు, మహిళలు, పురుషులు ఇలా అన్ని విభాగాలలో లో దుస్తుల బట్టల విక్రయాలు స్వల్పంగా ఉన్నాయని అంటున్నారు.
డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో లో దుస్తుల వినియోగం 55 శాతం తగ్గిపోయిందని తెలుస్తోంది. 2023–2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జాకీ మొత్తం ఆదాయం 28 శాతం, విలువ 31శాతం పెరిగాయి. అయితే గత సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది ఆదాయంలో 7.5 శాతం, పరిమాణంలో 11.5 శాతం క్షీణతగా తేలింది.
డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో జాకీ, లక్స్ ఇండస్ట్రీస్ మాతృ సంస్థ అయిన పేజ్ ఇండస్ట్రీస్ అమ్మకాలు క్షీణించాయి. పేజ్ ఇండస్ట్రీస్ వాల్యూమ్ 11 శాతం, షేర్ ధర ఐదు శాతం తగ్గిపోయాయి. గత ఏడాదిన్నర కాలంలో రూపా షేర్లు 52 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. భవిష్యత్తులో లో దుస్తుల విక్రయాలు ఇలాగే పడిపోతే ఆర్థిక వ్యవస్థలో ప్రతిదీ సరిగ్గా జరగడం లేదనడానికి ఇది సంకేతమంటున్నారు.