Begin typing your search above and press return to search.

హోరాహోరీ లో పోస్టల్ బ్యాలెట్ కిరికిరి !

ప్రతీ ఒక్క ఓటూ కీలకం అవుతుందని సర్వేల అంచనాలు చెబుతున్నాయి. కనీసంగా పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాలలో కేవలం వేయి అయిదు వందల ఓట్ల తేడాతో ఫలితం డిసైడ్ అవుతుందట.

By:  Tupaki Desk   |   29 May 2024 3:44 AM GMT
హోరాహోరీ లో పోస్టల్ బ్యాలెట్ కిరికిరి !
X

ప్రతీ ఒక్క ఓటూ కీలకం అవుతుందని సర్వేల అంచనాలు చెబుతున్నాయి. కనీసంగా పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాలలో కేవలం వేయి అయిదు వందల ఓట్ల తేడాతో ఫలితం డిసైడ్ అవుతుందట. మరో పాతిక నుంచి ముప్పయి అసెంబ్లీ నియోజకవర్గాలలో వేయి నుంచి రెండు వేల లోపు మెజారిటీలతో గెలుపు శాసిస్తుందిట.

అంటే దాదాపుగా నలభై అసెంబ్లీ నియోజకవర్గాలలో క్లోజ్ ఫైట్ సాగుతోంది అన్నది అర్ధం అవుతోంది కదా. ఇక ఇపుడు పోస్టల్ బ్యాలెట్ విషయానికి వద్దాం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఈసారి ఏకంగా నాలుగు లక్షలకు పైగా జరిగింది. అంటే సగటున ప్రతీ నియోజకవర్గంలో మూడు వేలకు తక్కువ కాకుండా ఈ ఓటింగ్ ప్రభావం ఉంటుంది అన్న మాట.

మరి ఈ ఓటింగులో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్లు వారికి కలుస్తాయి. దాంతో ఓటమి అంచులలో ఉన్న వారు ఒక్కసారిగా గెలుపు తీరాలకు చేరుతారు. అంటే పైన చెప్పిన నలభై అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు రాతలను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మారుస్తుంది అనే అంటున్నారు.

దాంతో ఇపుడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ విషయంలో ఎలాంటి నిబంధనలు అనుసరిస్తారు అన్న చర్చకు తెర లేచింది దీని మీద చాలా రోజులకు ముందే టీడీపీ కూటమి మేలుకొని గెజిటెడ్ ఆఫీసర్ సీలు లేకపోయినా సంతకం లేకపోయినా కూడా ఆ ఓట్లను వాలీడ్ గా పరిగణించాలని ఈసీని కోరింది.

దాని మీద ఈసీ అయితే సీల్ లేకపోయినా ఫరవాలేదు వాటిని వాలిడ్ ఓట్లగానే చూడాలని టీడీపీ కూటమికి ఉపశమనం కలిగించే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ గైడ్ లైన్స్ వచ్చిన తరువాత కాస్తా ఆలస్యంగా వైసీపీ రియాక్ట్ అయింది.

పోస్టల్ ఓట్ల మీద ఆర్వో స్టాంపు లేకపోయినా ఆమోదించాలని ఇప్పుడు చెబుతున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా అని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఆయన నేతృత్వంలో వైసీపీ నేతలు అదనపు సీఈవోను కలిసి పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

గతంలో గెజిటెడ్ అధికారి సంతకం, స్టాంపు రెండూ ఉండాలని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సంతకం చాలు, స్టాంపు లేకపోయినా ఆమోదిస్తామని అంటున్నారని ఇదెక్కడి న్యాయమని మండి పడ్డారు. ఈ విధంగా ఈసీ ఇచ్చిన ఆదేశాలతో గందరగోళం చెలరేగే అవకాశముందని పేర్ని నాని పేర్కొన్నారు.

ఆయా పోస్టల్ బ్యాలెట్లపై ఏజెంట్లు అభ్యంతరం చెబితే కౌంటింగ్ హాళ్లలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఓటు గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ మార్గదర్శకాలను ఈసీ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని పేర్ని నాని తెలిపారు.

ఇక ఇదే అంశం మీద ఉద్యోగుల సంఘం రంగ ప్రవేశం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఒక వేళ పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఆర్వోలదేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పందిస్తూ ఉద్యోగుల ఓట్లు చెల్లకపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.

ఉద్యోగుల ఓటు చెల్లుబాటు అయ్యేలా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఓటు హక్కు వినియోగాన్ని సంక్లిష్టంగా మార్చుతున్నారని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సరళతరం చేయాల్సి ఉంది అని వ్యాఖ్యానించారు.

ఈ రెండు వెర్షన్లు ఏ విధంగా ఉన్నా పోస్టల్ బ్యాలెట్ కిరికిరి ఈసారి తప్పేట్లు లేదని అంటున్నారు. ఎందుచేతనంటే దేశంలో ఎక్కడా లేని సడలింపు ఒక్క ఏపీలోని పోస్టల్ బ్యాలెట్ కే ఇచ్చారు అని వైసీపీ ఫైర్ అవుతోంది. తమకు ఏ నిబంధలను లేకుండా ఓటు వేసింది వేసినట్లుగా తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

ఇంకో వైపు చూస్తే ఈ సడలింపుల వల్ల ఏకంగా యాభై వేల నుంచి లక్ష ఓట్లకు పైగా అదనంగా ఏదో ఒక రాజకీయ పార్టీకి లబ్ది చేకూరుతాయన్న ప్రచారం ఉంది. దాంతో వైసీపీ అలెర్ట్ అవుతోంది. అయితే వైసీపీ విన్నపాలను ఈసీ ఏ విధంగా చూస్తుందో ఇప్పటికే ఆర్వోలకు ఇచ్చిన సడలింపుల మార్గదర్శకలాను వెనక్కి తీసుకుంటారో లేదో అన్నది మాత్రం చర్చగానే ఉంది.