Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. 20 మంది అధికారులపై వేటు!

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగంపై సీఈసీ ప్రక్షాళన చేపట్టినట్టుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 4:10 AM GMT
ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. 20 మంది అధికారులపై వేటు!
X

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగంపై సీఈసీ ప్రక్షాళన చేపట్టినట్టుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వారిలో నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌, రవాణాశాఖ కార్యదర్శి ఉన్నారు. ఈ సమయంలో... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ 20మందికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని సీఈసీ స్పష్టం చేసింది.

అవును... ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఎన్నికల కమిషన్ లేఖ పంపించింది. ఇదే సమయంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా ప్రత్యామ్నాయ అధికారుల జాబితాను పంపాలని సీఎస్ శాంతికుమరిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇదే సమయంలో ఒక్కో అధికారి పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురేసి అధికారులతో జాబితాను రూపొందించి పంపించాలని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... ఇదే సమయంలో ఆయా అధికారులకు సంబంధించిన అయిదేళ్ల వార్షిక పనితీరు, విజిలెన్స్‌ నివేదికలను కూడా వాటికి జతచేసి పంపాలని పేర్కొంది. ఈలోపు తప్పించిన అధికారుల తర్వాతి స్థానంలో ఉన్నవారికి టెంపరరీగా తక్షణం బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది.

అదేవిధంగా... ఇలా వేటు పడిన 20 మంది అధికారులకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకు మరెలాంటి బాధ్యతలు కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో... ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో 13 మంది ఐపీఎస్‌ అధికారులు తక్షణం ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని శాంతికుమారి బుధవారం రాత్రి వారికి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ముగ్గురు కమిషనర్లు కాగా, పదిమంది ఎస్పీలు ఉన్నారు.

ప్రస్తుతం ఈ ముగ్గురు కమిషనర్ల స్థానంలో ఇన్ ఛార్జ్ లకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా... హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్థానంలో శాంతిభద్రతల అదనపు కమిషనర్‌ విక్రంసింగ్‌ మాన్‌ కు.. వరంగల్‌ కమిషనర్‌ రంగనాథ్‌ ప్లేస్ లో డీసీపీ మురళీధర్‌ కు.. నిజామాబాద్‌ కమిషనర్‌ సత్యనారాయణ స్థానంలో అదనపు డీసీపీ జయరాం కు బాధ్యతలు అప్పగించాలని సీఎస్‌ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్పీలు.. ఆయా జిల్లాల ఏఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలన్నారు.

ఇలా కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిన వారిలో సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్‌, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌ నగర్‌ ఎస్పీ నర్సింహ, నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, జగిత్యాల ఎస్పీ భాస్కర్‌, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.

వీరితో పాటు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె.శ్రీదేవి.. రవాణా శాఖ కార్యదర్శి కే ఎస్ శ్రీనివాస రాజు.. అబ్కారీ శాఖ డైరెక్టర్ మహ్మద్ ముషారఫ్ అలి ల స్థానలో ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

కాగా... అక్టోబరు 3 నుంచి 5 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై వారు సుదీర్ఘంగా సమీక్షించారు. ఇందులో భాగంగా... పోలీసు శాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఫలితంగా... ఈ కొరడా అని అంటున్నారు!