తెలంగాణలో కర్ణాటక సర్కారు ప్రకటనలపై ఈసీ సీరియస్ వ్యాఖ్యలు!
అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వటాన్ని తప్పు పడుతూ బీజేపీ నేతలు పలువురు ఈసీకి ఏడు పేజీల లేఖ రాశారు.
By: Tupaki Desk | 28 Nov 2023 5:05 AM GMTతెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాల్ని వెల్లడించింది. తెలంగాణకు చెందిన పత్రికల్లోనూ.. మీడియా సంస్థలకు ఇస్తున్న ప్రకటనల్ని తక్షణమే నిలిపివేయాలని పేర్కొంటూ ఆదేశాల్ని జారీ చేసింది. గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటనలు ఇచ్చిన తీరుపై అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాఖీదులు జారీ చేసింది.
అంతేకాదు.. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు సంజాయితీ ఇవ్వాలని కర్ణాటక సీఎస్ కు నోటీసులు ఇవ్వటమే కాదు.. ప్రభుత్వ సమాచార.. ప్రజా సంబంధాల విభాగం సెక్రటరీ ఇన్ ఛార్జిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొనటం గమనార్హం. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన ప్రకటనలపై బీజేపీఅభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
దీనిపై స్పందించిన ఈసీ సీరియస్ అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాల్ని విడుదల చేసిందని.. దాని ప్రకారం కేంద్రం కానీ ఎన్నికలు జరగని రాష్ట్రాలు వాటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వటం ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వటాన్ని తప్పు పడుతూ బీజేపీ నేతలు పలువురు ఈసీకి ఏడు పేజీల లేఖ రాశారు.
లేఖ రాసిన వారిలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్.. బీజేపీ నేతలు ప్రకాశ్ జవడేకర్.. సునీల్ బన్సల్.. తరుణ్ ఛుగ్.. సుధాంశు త్రివేది.. ఓంపాఠక్ లు ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రులపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ.. సోమవారం రాత్రి స్పందించారు. తెలంగాణలో అలాంటి ప్రకటనల ప్రచురణను తక్షణం నిలిపివేయాలని కోరారు. అంతేకాదు.. నియమావళిని ఎందుకు ఉల్లంఘించారో తెలుపుతూ సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేయటం గమనార్హం. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారు వైఫల్యాల్ని అదే పనిగా తెలంగాణ అధికారపక్షం పదే పదే తమ ఎన్నికల ప్రసంగాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో.. తాము సాధించిన విజయాల్ని పేర్కొంటూ ఫుల్ పేజీ ప్రకటనల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.