మునుగోడు-పాలేరు-ఖమ్మంపై ప్రత్యేక నిఘా..ఏం జరుగుతోంది..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది.
By: Tupaki Desk | 20 Nov 2023 5:50 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల పోలింగ్‌కు సమయం చేరువ అవుతుండడంతో పంపకాలు ఎక్కువగా జరుగుతాయనే అంచనాలు ఉన్న నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం నిఘా తీవ్రతరం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో మునుగోడు, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు బహిరంగంగానే ఓటర్లకు నగదు పంపిణీ చేయడం తెలిసిందే.అప్పట్లో ఎన్నికల సంఘం ఈ పంపకాలను అడ్డుకోలేక పోయింది.
దీంతో ఎన్నిక లసంఘంపై అనేక విమర్శలు వచ్చాయి. ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలోని కొన్ని కీలక నియోజకవర్గాలపై ఈసీ ముందుగానే అలెర్ట్ అయింది. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌కు ముందు నుంచి పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్లాది రూపాయల నగదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతల నుంచే వస్తోందని అధికారులు భావిస్తున్నారు. అయితే.. వీరికి సంబంధించిన ఆనవాళ్లు కానీ.. ఆధారాలు కానీ.. లభించలేదు.
అయినప్పటికీ.. నగదు మాత్రం కొన్ని ప్రాథమిక ఆధారాలను బట్టి.. ఉమ్మడి ఖమ్మంలోని పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులకు చెందినవే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాలు సహా.. మునుగోడు లోనూ ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన తనిఖీ ఏర్పాటు చేయనుంది. సోమవారం లేదా మంగళవారం నుంచి ఐటీ సహా ఈసీ అధికారులు.. ఎలాంటి హడావుడి లేకుండానే ఈ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్టు సమాచారం.
ముఖ్యంగా మునుగోడు, పాలేరు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు రాష్ట్రంలోనే కోటీ శ్వరులు కావడం.. గతంలోనూ పంపకాలు చేసిన నేపథ్యంలో వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారనే సమాచారం వస్తోంది. ఇక, ఈ దఫా ఖమ్మంలోనూ భారీ ఎత్తున నగదు పంపిణీకి అవకాశం ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ అధికారులు మఫ్టీలో తిరుగుతూ.. అణువణువునూ గాలించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఏ చిన్న తేడా వచ్చినా.. పెద్ద నేతలకు ఇక్కట్లు తప్పవని పరిశీలకులు చెబుతున్నారు.