సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే!
'ఇంకోసారి ఇలా చేస్తే.. ఏకంగా పార్టీనే రద్దు చేయాల్సి ఉంటుంది" అని ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ కు రాసిన లేఖలో హెచ్చరించింది.
By: Tupaki Desk | 25 Nov 2023 2:34 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని విషయాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అంశాలు సహా.. వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న నాయకులు, పార్టీల తీరుపై నిరంతరం డేగ కన్ను సారిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు.. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 'ఇంకోసారి ఇలా చేస్తే.. ఏకంగా పార్టీనే రద్దు చేయాల్సి ఉంటుంది" అని ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ కు రాసిన లేఖలో హెచ్చరించింది.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ సహా విపక్షాలు చాలా సీరియస్‌గా ప్రచారం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నాయకులు నోరు చేసుకుంటున్నారు. అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నుంచి మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ వరకు.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. సన్నాసులు పోయి.. వెధవలు, నా..కొ..కలు వరకు వెళ్లిపోయింది. ఇక, జంతువుల పేర్లతోనూ తిట్టేస్తున్నారు.
దున్నపోతులు, కుక్కలు అంటూ.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి అంశాలపైనే ఎన్నికలసంఘానికి ఫిర్యాదులు అందాయి. సీఎం కేసీఆర్ అక్టోబరు 30న నిర్వహించిన ఎన్నికల సభలో కాంగ్రెస్ నేతలను కుక్కలతో పోల్చి తిట్టారు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హుస్నాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం తాలూకు వీడియోలను తెప్పించుకున్న ఎన్నికల సంఘం కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ ప్రధాన కార్యాలయానికి లేఖ సంధించింది.
"మీరు సీనియర్ నాయకులు. పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఇది సరికాదు. మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే.. నాయకులను ఎన్నికల నుంచి బహిష్కరించే హక్కు, ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేసే హక్కు కూడా ఎన్నికల సంఘానికి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సారికి వదిలేస్తున్నాం. ఇంకో రిపీట్ చేయొద్దు!" అని ఎన్నికల సంఘం కేసీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరిక లేఖ పంపడం గమనార్హం.