రాజకీయ పార్టీలకు ఈసీ భారీ వార్నింగ్
ఇలాంటి వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారం ఏ రీతిలో ఉండాలన్న దానిపై మరింత స్పష్టతను ఇచ్చింది.
By: Tupaki Desk | 2 March 2024 4:35 AM GMTలోక్ సభ ఎన్నికలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడింది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారం ఏ రీతిలో ఉండాలన్న దానిపై మరింత స్పష్టతను ఇచ్చింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
దీనికి సంబంధించిన అడ్వైజరీని విడుదల చేసింది. గతంలో నిబంధనల్ని ఉల్లంఘించి నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు.. అభ్యర్థులు మరోసారి తప్పు చేసే కఠిన చర్యలు తప్పనిసరిగా తేల్చింది. అంతేకాదు.. కులం.. మతం.. భాష ప్రాతిపదికన ఓట్లు అడగకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇతర మతాల దేవుళ్లను.. దేవతల్ని కించపరిచేలా మాట్లాడొద్దని పార్టీలకు.. రాజకీయ నేతలకు స్పష్టతను ఇచ్చింది.
ప్రచార వేళ మర్యాదలు.. సంయమనం పాటించాల్సిందేనన్న ఈసీ.. ప్రత్యర్థుల్ని కించపర్చటం.. అవమానించటం మాత్రమే కాదు ఆ తరహా పోస్టుల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని తేల్చింది. విద్వేష వ్యాఖ్యలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని ఈసీ కోరింది. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారాన్ని.. అభ్యర్థుల ప్రసంగాల్ని తాము నిశితంగా పరిశీలిస్తామని.. సమాపంలో వర్గ విభేదాలను.. శత్రుత్వాన్ని పెంచేలా మాటల.. చర్యల్ని తాము ఒప్పుకోమన్నారు.
ఓటర్లను తప్పు దారి పట్టించే లక్ష్యంతో చేసే ప్రకటనలతో పాటు నిరాధార ఆరోపణల్ని ప్రచారం చేయొద్దని చెప్పిన ఈసీ.. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని పేర్కొంది. దేవాలయం.. మసీదు.. చర్చి.. గురుద్వారా లేదంటే మరే ఇతర ప్రార్థనా స్థలాల్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. మహిళల గౌరవానికి.. వారి మర్యాదకు భంగం కలిగించే చర్యలకు.. ప్రకటనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ప్రత్యర్థుల ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా సోషల్ మీడియా పోస్టుల్ని షేర్ చేయద్దన్న ఈసీ.. స్పష్టమైన మార్గదర్శకాల్ని ప్రస్తావించారు.మరి.. ఈసీ చెప్పిన ఈ అంశాల్లో ఎన్నింటిని రాజకీయ పార్టీలు ఫాలో అవుతాయో చూడాలి.