నామినేషన్ వేసి బయటకు వచ్చిన ఎంపీ అభ్యర్థికి ఈడీ సమన్లు
ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన అమోల్ కార్తికర్ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 March 2024 3:54 AM GMTరాజకీయాల్లో ఈడీని వినియోగించి.. తనకు నచ్చని, తనకు ఎదురు తిరుగుతున్న పార్టీలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేధిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణంలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇక, తెలంగాణకు చెందిన మాజీ సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆయన కుమార్తె కవితను కూడా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ ఏకంగా తీహార్ జైలుకు పంపించారు. ఈ ఇద్దరూ కూడా తాము కడిగిన ముత్యంలా బయటకు వస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసులు అని కూడా విమర్శించారు.
కట్ చేస్తే..ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. బీజేపీని వ్యతిరేకించి.. ఆ పార్టీతో సంబంధాలు తెంచుకున్న మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సొంతంగా `ఉద్ధవ్ శివసేన పార్టీ`ని నడుపుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున కూడా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉద్దవ్ నేతృత్వంలోని శివసేనను కూడా తెరమరుగు చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆ పార్టీ నేతలు తరచుగా విమర్శలు చేస్తున్నారు. దీనికి దన్నుగా అన్నట్టు.. తాజాగా ఈడీ అధికారులు ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి నోటీసులు జారీ చేశారు. అది కూడా ఆయన నామినేషన్ వేసి.. బయటకు వచ్చిన మరుక్షణం.. నామినేషన్ కేంద్రం వద్దే ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
ఈడీ ఏమందంటే..
ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన అమోల్ కార్తికర్ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నామినేషన్ వేశారు. అయితే..ఆయన నామినేషన్ వేసి బయటకు రాగానే ఈడీ అధికారులు అక్కడకు చేరుకుని ఆయనకు నోటీసులు ఇచ్చారు. ``మీరు.. కరోనా సమయంలో వలస కార్మికులకు అందించిన ఆహారానికి సంబంధించి ఇచ్చిన కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడ్డారు. అందుకే మిమ్మల్ని విచారించాలని వచ్చాం`` అని సమన్లలో పేర్కొన్నారు. దీనికి ఆయన ప్రతిస్పందించకుండా సమన్లను తీసుకున్నారు. అయితే ఉద్దవ్ వర్గం మాత్రం బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది.
``ఎప్పుడో మూడు సంవత్సరాల కిందట.. వలస కార్మికులకు అన్న పెట్టిన దాంట్లో అవినీతి జరిగిందని ఇప్పుడు ఆరోపిస్తారా? అప్పట్లో ఏం చేశారు. ఈ మూడు సంవత్సరాలు ఏం చేశారు? నిద్ర పోయారా? ఇది ముమ్మాటికీ మమ్మల్ని, మా అభ్యర్థులను ఎన్నికలకు ముందు బెదిరించే చర్యల్లో భాగమే. అయినా.. మేం భయపడం.`` అని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత అన్నారు. దీనిపై ఉద్దవ్ ఠాక్రే స్పందించాల్సి ఉంది.