Begin typing your search above and press return to search.

ఏమైంది.. దేశం దేశం చిమ్మ చీకట్లో!

అలాంటిది ఒక దేశం మొత్తం కొన్ని గంటలపాటు కరెంటు లేకుండా చిమ్మ చీకట్లో గడిపితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   20 Jun 2024 12:30 PM GMT
ఏమైంది.. దేశం దేశం చిమ్మ చీకట్లో!
X

మనం ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి కరెంటు పోతే ఉపిరితిపిరై పోతాం. కరెంటు ఎప్పుడు వస్తుందో క్షణాలు, నిమిషాలు లెక్కపెడతాం. అప్పటికీ రాకపోతే ఇంకా రాలేదని అసహనానికి, చిరాకుకు గురవుతాం. అలాంటిది ఒక దేశం మొత్తం కొన్ని గంటలపాటు కరెంటు లేకుండా చిమ్మ చీకట్లో గడిపితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది?

ఇప్పుడు ఇదే జరిగింది.. దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ లో

బుధవారం ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ లో వైఫల్యం కారణంగా ఊహించని బ్లాక్‌ అవుట్‌ ఏర్పడింది. విద్యుత్‌ ఉత్పత్తిలో సమస్యల కారణంగా దేశమంతా అంధకారం అలుముకుంది.

ఈక్వెడార్‌ దేశంలోని కొన్ని రంగాలలో అరగంటకుపైగా అంతరాయం కొనసాగింది. అయితే చాలా నగరాల్లో ఈ సమస్య మరిన్ని గంటలపాటు కొనసాగిందని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా వెల్లడించాయి.

ఈక్వెడార్‌ రాజధాని క్విటోకు ఉత్తరాన ఉన్న రెస్టారెంట్‌ లో వెయిట్రెస్‌ గా పనిచేస్తున్న ఎమిలియా సెవాల్లోస్‌ మాట్లాడుతూ కరెంట్‌ తమ హోటళ్లలోనే పోయిందని అనుకున్నానని.. తర్వాత దేశమంతా పోయిందని తెలుసుకుని ఆశ్చర్యపోయానని వివరించారు.

విద్యుత్‌ లేకపోవడంతో రాజధాని క్విటోలో ట్రాఫిక్‌ లైట్లు ఆగిపోయి ట్రాఫిక్‌ అస్తవ్యస్తమైంది. నగరంలోని సబ్‌వే వ్యవస్థను నిర్వహించే సంస్థ క్విటో మెట్రో విద్యుత్‌ వైఫల్యం కారణంగా సేవలను నిలిపివేసింది. రైల్వే వ్యవస్థలు, ఆస్పత్రులు కరెంటు లేక నరకం చూశాయి.

ఇప్పుడే కాదు గత సంవత్సరం నుండి ఈక్వెడార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈక్వెడార్‌ దేశ అధ్యక్షుడు డేనియల్‌ నోబోవా ప్రభుత్వం దేశంలోని ప్రధాన నగరాల్లో రోజుకు 8 గంటలపాటు విద్యుత్‌ కోతలు విధించింది.

ఎల్‌ నినో పరిస్థితులతో ఈక్వెడార్‌ లో సరిగా వర్షాలు పడటం లేదు. రిజర్వాయలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈక్వెడార్‌ మొత్తం విద్యుదుత్పత్తిలో 75 శాతం జల విద్యుత్‌ ప్లాంట్‌ నుంచే వస్తోంది. అయితే జల సంక్షోభంతో ఆ ప్లాంట్లన్నీ నిలిచిపోయాయి. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.

ఎట్టకేలకు కొన్ని గంటలపాటు అంధకారం తర్వాత బుధవారం అర్ధరాత్రికి విద్యుత్‌ ను పునరుద్ధరించారు. తిరిగి దేశంలో 95శాతం ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా చేశారు. దీంతో ఈక్వెడార్‌ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.