ఎన్నికల ఎఫెక్ట్: రాజకీయ భజనలు రకరకాలు బ్రో..!
మా నాయకుడు ఇది చేశాడు.. అని పొగడ్తల వర్షంలో తాము మునుగుతూ.. తమ నాయకులను ముంచేస్తున్నారు నాయకులు.
By: Tupaki Desk | 11 Aug 2023 8:24 AM GMTఎన్నికలు వచ్చేస్తున్నాయి. అటు కేంద్రంలోనూ, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు ముహూర్తం రెడీ అయిపోతోంది. దీంతో రాజకీయ భజనలు తెరమీదికి వచ్చేస్తున్నాయి. వాస్తవానికి రాజకీయం అం టేనే భజన. కింది స్థాయి నాయకుడు.. ఎమ్మెల్యేని పొగడాలి. ఎమ్మెల్యే తనపైనున్న మంత్రిని పొడగాలి.. ఆయన అధినేతను పొగడాలి. కుదిరితే.. భారీ ఎత్తున పేపర్లలో పుట్టిన రోజు, పెళ్లిరోజుల పేరుతో అధినేతలకు సంబంధించిన ప్రకటనలు కూడా గుప్పించాలి.
ఇక, మండలస్థాయి నాయకులు లోకల్ స్థాయిలో టీవీల్లోనూ అధినేతలను ఆకాశానికి ఎత్తేసేయాలి. జిల్లా స్థాయి నేతలు.. టాబ్లాయిడ్లలోనూ.. జిల్లాస్థాయి న్యూస్ ఛానెళ్లోనూ.. ప్రకటనలు గుప్పించాలి. ఇక, రాష్ట్ర స్థాయి నాయకులు అయితే.. మీడియా ముందు.. వెనుక కూడా.. భారీ ఎత్తున నాయకులను కాకా పట్టాలి. భజన బాగా చేయాలి. లేకపోతే.. టికెట్లు వచ్చే పరిస్థితి ఎక్కడా ఏ కోశానా కనిపించడం లేదు. ఈ భజన బృందం అన్ని పార్టీలలోనూ కనిపిస్తుండడం గమనార్హం.
''ఎందుకయ్యా అలా పొగుడుతావు. మనం చేసింది మనం కాదు.. ప్రజలు చెప్పుకోవాలి. నీ నియోజకవ ర్గంలో ఏదైనా పెండింగ్ సమస్య ఉంటే దానిపై మాట్లాడు. లేకపోతే.. ఆ సమయాన్ని వేరే సభ్యుడికి ఇస్తే.. సమస్యను ప్రస్తావిస్తాడు కదా! నన్నెందుకు వృథాగా పొగుడుతావు''- ఇదీ.. పార్లమెంటులో లోక్‌సభ వేదికగా.. అప్పటి ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్ కొందరు సభ్యులను ఉద్దేశించి చేసిన మేలిమి మాట.
ఇక, తెలుగు రాష్ట్రాలకు వస్తే.. ''మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. ఇది రాజకీయ వేదిక కాదు. నన్ను పొగడడానికి.. నేను మిమ్మల్ని అభినందించడానికి''- దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు.. అసెంబ్లీ వేదికగా తన సొంత పార్టీ నాయకులకు చేసిన మేలిమి సూచన. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఊహించలేం. కూర్చుంటే.. మా నాయకుడు అది చేశాడు.. నుంచుంటే.. మా నాయకుడు ఇది చేశాడు.. అని పొగడ్తల వర్షంలో తాము మునుగుతూ.. తమ నాయకులను ముంచేస్తున్నారు నాయకులు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు అయినా.. రెండు రోజుల కిందట ముగిసిన తెలంగాణ అసెంబ్లీ అయినా.. అసలు అసెంబ్లీనా.. మీడియా మీటింగా.. సెల్పీవీడియోనా అన్నతేడాలేకుండా.. వైసీపీ నాయకులు చేసే ప్రసంగాలైనా వేటిని చూసినా.. అధినేతల భజనలో ఆరితేరుతున్నారు. ఇక ఎన్నికలకు సమయం వచ్చేస్తుండడంతో ''ప్రసంగాలు రాసేవారు కావలెను!'' అంటూ నాయకులు ఓరల్ ప్రకటనలు ఇస్తున్నారు. మొత్తానికి రాజకీయ భజనలు ప్రజల చెవుల్లో మార్మోగనున్నాయన్న మాట.