Begin typing your search above and press return to search.

ఎంకిపెళ్లి సుబ్బిచావు... ఇండియన్స్ పై యూఎస్ అక్రమ వలసల ఎఫెక్ట్!

వివరాళ్లోకి వెళ్తే... భారత్‌, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎల్‌ సాల్వడార్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 11:30 AM GMT
ఎంకిపెళ్లి సుబ్బిచావు... ఇండియన్స్  పై యూఎస్  అక్రమ వలసల ఎఫెక్ట్!
X

సీత కష్టాలు సీతకుంటే.. పీత కష్టాలు పీతకుంటాయని అంటారు. అంటే... పెద్దోడికుండే కష్టాలు పెద్దోడికుంటే... పెద్దోళ్లకు ఏమీ కష్టాలు ఉండవని పేదోళ్లు అనుకుంటే పొరపాటని... ఎవరి స్థాయిలో వారి వారి కష్టాలు వారి వారి కుంటాయని చెబుతారు. ఈ సమయంలో పేద దేశాల్లో వారి సమస్యలు వారి కుంటే... అగ్రరాజ్యం అమెరికాకు కూడా సమస్యలు ఉన్నాయి! అగ్రరాజ్యానికేముంటాయని లైట్ తీసుకోవద్దు సుమా... వారికీ ఉన్నాయి కష్టాలు. అవే... అక్రమ వలసలు!

అవును... అటు కెనడా, ఇటు ఆఫ్రికాతో పాటు పలు దేశాల నుంచి ఏటా చాలా మంది సెంట్రల్‌ అమెరికా మీదుగా యూఎస్‌ కు అక్రమంగా వలస వెళ్తున్నారని, అలా వెళ్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమెరికా కస్టంస్, బోర్డర్ పెట్రోలింగ్‌ లెక్కల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సుమారు 3.2 మిలియన్ల మంది అక్రమంగా యూఎస్‌ కు వలస వచ్చినట్లు తేలింది.

దీంతో ఈ అక్రమ వలసలను ఆపడానికి అగ్రరాజ్యం అమెరికా మాగ్జిమం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కెనడా మీదుగా వచ్చేవారిపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచిన యూఎస్... ఇప్పుడు ఆఫ్రికాతో పాటు పలు దేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. దానికోసం మధ్యలో ఎల్ సాల్విడార్ లో ఒక మెలిక పెట్టించిందని అంటున్నారు. ఆ మెలిక ఇప్పుడు భారతీయులకు అదనపు భారంగా మారిందని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... భారత్‌, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎల్‌ సాల్వడార్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇకపై ఎవరైనా తమ దేశంలోకి రావాలంటే 1,000 డాలర్ల ఫీజు కట్టాలని వెల్లడించింది. ఈ విషయాలను అధికారిక వెబ్ సైట్ లోనూ పొందుపరిచింది. ఈ దేశం మీదుగా అమెరికాకు వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఇటీవల ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు నయిబ్‌ బుకెలి.. అమెరికా పశ్చిమార్థ గోళ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బ్రియన్‌ నికోలస్‌ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా అక్రమ వలసలపైనే చర్చ జరిగిందని అంటున్నారు. దీంతో.. ఆ భేటీ అనంతరం.. భారత్‌, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికులపై ఫీజు విధిస్తూ ఎల్ సాల్విడార్ నిర్ణయం తీసుకుంది. దీంతో... అక్టోబరు 23 నుంచే ఈ ఫీజు అమల్లోకి వచ్చింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. భారత్, ఆఫ్రికా దేశాల ప్రయాణికులు ఇకపై ఎల్‌ సాల్వడార్‌ వెళ్లాలంటే.. వ్యాట్, ఇతర ఛార్జీలతో కలిపి 1,130 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రయాణికుల రోజువారీ జాబితాను వియానయాన సంస్థలు సాల్వడార్‌ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు ఈ తప్పనిసరి ఫీజు గురించి తమ ప్రయాణికులకు టికెట్‌ బుకింగ్‌ సమయంలోనే నోటిఫై చేస్తున్నాయి.

దీనివల్ల ఎవరి గమ్యస్థానాలు ఏమిటి అనే విషయంపై ఒక క్లారిటీ ఉంటుందని అంటున్నారు! ఫలితంగా అమెరికాలో అక్రమ వలసలను కొంతైనా నియంత్రించవచ్చని భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు... అమెరికా అక్రమ వలసల ఎఫెక్ట్ వల్ల భారతీయులకు 1000 డాలర్లు హాం ఫట్ అన్నమాట!