బండి సంజయ్‌పై కోడిగుడ్లతో దాడి... ఎక్కడ ఎందుకు?
తెలంగాణ బీజేపీ నాయకుడు, కరీంనగర్ ఎంపీ, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్‌పై అనూహ్య ఘటన జరిగింది
By: Tupaki Desk | 28 Feb 2024 10:26 AM GMTతెలంగాణ బీజేపీ నాయకుడు, కరీంనగర్ ఎంపీ, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్‌పై అనూహ్య ఘటన జరిగింది. ఆయన కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు యువకులు కోడిగుడ్లతో దాడులు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే.. కొన్ని కోడిగుడ్లు.. ఆయన కాన్వాయ్‌కు తగిలి పగిలిపోగా.. సంజయ్ మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై బండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ ప్రచారానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర చేపట్టారు. ప్రత్యేక కాన్వాయ్‌లో ఆయన అక్కడకు చేరుకుని పార్టీ కార్యకర్తలతో కలిసి.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రశాంతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనూహ్యంగా అలజడి రేగింది.
వంగర ప్రాంతంలో బండి ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దూసుకువచ్చారు. వీళ్లు ఎవరు అని బండి సంజయ్ ప్రశ్నించేలోపే.. చేతిలో తెచ్చుకున్న కోడిగుడ్లను ఆయనపై విసిరే ప్రయత్నం చేశారు. అయితే.. చాకచక్యంగా బండి తప్పించుకోగా.. అవి కాన్వాయ్ మీద పడ్డాయి. కారు అద్దం కూడా ధ్వంసమైంది. ఇక, ఈ దాడితో అసహనం చెందిన బండి సంజయ్ పోలీసులపై నిప్పులు చెరిగారు.
మీరు ఉన్నది కోడిగుడ్ల దాడి చేస్తుంటే చూసేందుకేనా? లేక పోతే. నాపై కేసులు పెట్టేందుకేనా? అని ప్రశ్నించారు. ఈమాత్రం దానికి తనకు పోలీసు బందోబస్తు ఏం వద్దని.. మీరు వెళ్లిపోండి.. అంటూ పోలీసులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోడిగుడ్ల దాడి వెనుక.. బీఆర్ ఎస్ హస్తం ఉందని.. కేటీఆర్ ఆదేశాలతోనే కార్యకర్తలు రెచ్చిపోయారని.. విమర్శలు గుప్పించారు.