Begin typing your search above and press return to search.

ఇగో అంత పని చేస్తుందా... చరిత్ర ఇదే !

ఇగో తెలుగులో చెప్పుకుంటే అహంకారం ఇది చాలా ప్రమాదకరమైనది. వినాశనానికి అతి దగ్గర దారి అని కూడా చెబుతారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 12:30 AM GMT
ఇగో అంత పని చేస్తుందా... చరిత్ర ఇదే !
X

ఇగో తెలుగులో చెప్పుకుంటే అహంకారం ఇది చాలా ప్రమాదకరమైనది. వినాశనానికి అతి దగ్గర దారి అని కూడా చెబుతారు. ఇగోతో వివిధ రంగాలకు చెందిన వారి జీవితాలు పూర్తిగా నాశనం అయిన ఉదంతాలు ఎన్నో చరిత్రలో పదిలంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇగో వల్ల అధికారం కోల్పోయిన వారి చరిత్ర కూడా ఈ దేశంలో భద్రంగానే ఉంది.

ఈ విధంగా చూస్తే మనిషిని ప్రపంచంలో నాశనం చేసేది ఇగోనే అని చెప్పాలి. ఎక్కడైనా ఇదే విషయం పదే పదే రుజువు అవుతూ వస్తోంది. రాజకీయాల్లో చూసినా బిజినెస్ ఫీల్డ్ లో చూసినా ఆఫీసులలో చూసినా ఇవన్నీ కాదు ఆఖరికి ఫ్యామిలీ లైఫ్ లో చూసినా ఇదే కనిపిస్తుంది.

ఒక మనిషి కెరీర్ తో పాటు ఆయన టోటల్ లైఫ్ ని పూర్తిగా ముంచేసేదే ఇగో అని సర్వత్రా తెలిసిన సత్యం. రాజకీయాల్లో చూస్తే మొదటి తరం వాళ్ళంతా సమిష్టి కృషిని నమ్మేవారు. ఏ విజయం అయినా కలసి పంచుకునేవారు. తమ ఒక్కడి క్రెడితే అని అసలు భావించే వారు కానే కాదు. వారికి రాజకీయ పార్టీ అన్న సంస్థ మీద వ్యవస్థ మీద నమ్మకం అపారంగా ఉండేది.

అంతే కాదు ఆనాడు వ్యక్తి పూజ అన్నది లేదు. వ్యవస్థతోనే ఏదైనా అని భావించే తరం ఆనాడు ఉండేది. అలా గొప్ప విలువలు కనిపించేవి. ఇక తరువాత కాలం చూస్తే ప్రజాకర్షణ అన్న ఒకటి ముందుకు వచ్చింది. దానిని పొలిటికల్ గ్లామర్ గా అభివర్ణించే వందిమాగదులు భజన పరులతోనే అఖిలభారత స్థాయిలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది.

అలా ఇగోస్ తో తొలినాటి కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని శ్రీమతి ఇందిరాగాంధీ పోగొట్టుకున్నారు. ఆమెను కాదని సీనియర్లు అంతా కలసి రెడ్డి కాంగ్రెస్ ని స్థాపించారు. అందులో నుంచి ఇందిరకు చోటు లేదని దాని ప్రెసిడెంట్ బ్రహ్మానందరెడ్డి ఖండితంగా చెప్పేశారు. అలా ఇగోస్ తో వ్యక్తి పూజతో చుట్టూ కోటరీతో ఇందిరాగాంధీ ఎంత నష్టపోయింది అన్నది 1977 ఎన్నికలు రుజువు చేశాయి.

అలా తానే సర్వస్వమని భావించిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పార్టీనీ ఓడించారు.తానూ ఓటమి పాలు అయ్యారు. అయితే తప్పులు ఎక్కడ జరిగాయో చూసుకుని ఇందిరా గాంధీ పుంజుకుంది. కాంగ్రెస్ ఐ పేరుతో పార్టీని స్థాపించి ఆమె మళ్లీ అధికారానికి చేరువ అయ్యారు. ప్రస్తుతం దేశంలో ఆమె స్థాపించిన కాంగ్రెస్ పార్టీయే ఉంది.

ఇక సోనియా గాంధీ విషయానికి వస్తే ఆమె కూడా అదే చేశారు అని అంటున్నారు. అంతా ఆమె చుట్టూ ఉంచుకోవడం యూపీయే వన్ యూపీయే టూలలో తానే కేంద్ర బిందువుగా మారడంతో పాటు తనతో ఉన్న బలమైన కోటరీ మూలంగా ఆమె తీసుకున్న నిర్ణయాలతో గత మూడు ఎన్నికల నుంచి కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపోయింది. అంటే ఇగోస్ వల్లనే ఇదంతా అని చెప్పక తప్పదు.

అన్నీ తెలిసిన చంద్రబాబు రాజకీయంగా వ్యూహరచనా చతురుడు అయినా కూడా పదేళ్ళ పాటు వైఎస్సార్ జమానాలో అధికారాన్ని కోల్పోయారు. ఆయన ఉమ్మడి ఏపీకి సీఎం గా కాకుండా సీఈఓగా వ్యవహరించడంతో పాటు చుట్టూ ఉన్న వారితోనే అంతా అనుకుని అదే నిజమని భ్రమించి ఆరు నెలల అధికారాన్ని ముందే వదులుకుని ఎన్నికలను ముందుకు జరిపి మరీ 2004లో ఓటమి పాలు అయ్యారు. అది 2009లో సైతం రిపీట్ అయింది.

ఇక చూస్తే 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అంతా తనతోనే అన్నట్లుగా వ్యవహరించడం ఇగోతో ముందుకు సాగడంతో 2019లో ఫలితాలు తేడా కొట్టాయి. కేవలం 23 సీట్లతో ఆయన ఓటమి పాలు అయ్యారు. అలా జగన్ చేతిలో బాబు ఓటమిని చూసారు.

ఇక వర్తమానంలో చూస్తే జగన్ కూడా అతి పెద్ద ఇగో అనే బ్యాగ్ ని మోస్తూ అయిదేళ్ళు పాలన చేశారు. తనకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకునే అందులోనే ఉంటూ జనాలను విస్మరించారు అని విమర్శలు వచ్చాయి. ఒక బలమైన కోటరీ చేతిలో బందీగా మారి వారి చెప్పినదే వింటూ గెలుపు ఖాయమని తనకు తిరుగులేదని అధికారం శాశ్వతమని జగన్ భావించారు, అదే సమయంలో భ్రమించారు కూడా. చివరికి చూస్తే 2024 ఎన్నికల ఫలితాలు రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. తేరుకుని చూసేసరికి కేవలం 11 సీట్లకే పరిమితం అయి రాజకీయంగా మట్టి కరిచే పరిస్థితి ఏర్పడింది.

దీనిని బట్టి ఎవరైనా అర్ధం చేసుకోవాల్సింది అధికారంలో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అపుడు కూడా కాళ్ళు నేల మీదన ఉంచి నడవడం చేస్తే కనుక ఇబ్బందులు రావు. అలాంటి వారు కూడా చరిత్రలో కనిపిస్తారు. పొరుగునే ఉన్న ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఏకంగా 24 ఏళ్ళ పాటు సీఎం గా ఉన్నారు. వరసగా అయిదు ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇదంతా సాధ్యమే అని ఇంకా చాలా మంది నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని చూస్తి స్పూర్తిని పొందాలి కానీ ప్రజా స్వామ్యంలో విపక్షం లేదు అనుకుంటే పొరపాటు, ప్రజలే అసలైన విపక్షం. వారికి నచ్చకపోతే గట్టిగా ఓడించి పక్కన పెడతారు.