సౌందర్య సువాసనల ‘మల్లె మొగ్గ’ల్లో వాడుతున్న పసిమొగ్గలు
బాల్యం అంటే అందమైన అనుభూతి.. కల్మషం ఎరుగని కమ్మని కాలం అది.. మల్లె మొగ్గలంతటి స్వచ్ఛమైన అలాంటి బాల్యం ఎవరికైనా తిరిగి రాదు.
By: Tupaki Desk | 3 Jun 2024 2:30 PM GMTబాల్యం అంటే అందమైన అనుభూతి.. కల్మషం ఎరుగని కమ్మని కాలం అది.. మల్లె మొగ్గలంతటి స్వచ్ఛమైన అలాంటి బాల్యం ఎవరికైనా తిరిగి రాదు. అందుకే మనం సుందరమైన బాల్యాన్ని ఆస్వాదించాలి. అయితే, రెండు ప్రధాన సౌందర్య ఉత్పత్తుల కంపెనీలకు మల్లె పూలను సరఫరా చేసేవారు మల్లెల సేకరణకు బాల కార్మికులను ఉపయోగించుకుంటున్నారు.
సౌందర్య ఉత్పత్తులు తయారుచేసే లాంకోమ్, ఏరిన్ సంస్థలకు పిల్లలు సేకరించిన మల్లె పూలను సరఫరా చేస్తున్నారు. ఇవే కాదు.. అన్ని లగ్జరీ పెర్ ఫ్యూమ్ బ్రాండ్‌లూ బాల కార్మికులను పని వస్తువులుగా చూస్తుండడం విషాదకరం. కాగా, లాంకోమ్ యాజమాన్య సంస్థ లోరియల్. ఏరిన్ యజమాని ఎస్టీ లాడర్. లాంకోమ్ ఉత్పత్తి ‘ఇడొల్ ఇంటెన్స్’, ఏరిన్ తయారీ ‘ఇకత్ జాస్మిన్’, ‘లిమోన్ డి సిలికా’కు కావాల్సిన మల్లె పూలు ఈజిప్ట్ నుంచి వస్తాయి.
మల్లెల దేశం ఈజిప్ట్..
ఇరాన్ కుంకుమ పువ్వుకు ఎంత ప్రసిద్ధో.. ఈజిప్ట్ మల్లె పూల సాగుకు అంత పేరుగాంచింది. ప్రపంచంలో పండే మల్లె పూలల్లో సగం ఈ దేశానివే. పెర్ ఫ్యూమ్ ల తయారీలో మల్లె కీలకమైన ముడిపదార్ధం.
ఖర్చుకు కక్కుర్తి పడి..
పెర్ ఫ్యూమ్ లో పేరుగాంచి అనేక లగ్జరీ బ్రాండ్‌ల యాజమాన్యాలు, బడ్జెట్ తగ్గించుకునేందుకు కార్మికులకు చాలా తక్కువ వేతనాలు ఇస్తుంటాయి. ఈజిప్ట్ లో మల్లె పూలను తక్కువ కూలీ ఇచ్చి పిల్లలతో కోయిస్తున్నారు. అయితే, ఎండలకు పూలు పాడవడానికి ముందే పిల్లలను పనిలో దింపాలి. దీంతో వారిని తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేపుతున్నారు.
ఐదేళ్ల పిల్లల నుంచి..
మల్లె పూలను తెంపేందుకు 5 నుంచి 15 ఏళ్ల వయసు నలుగురు పిల్లలను దింపుతోంది మహిళ హెబా. వీరంతా కలిసినా 1.5 కిలోల పూలను కోయగలిగారు. ఇందులో మూడో వంతు తోట యజమానికి చెల్లించాక రూ.125 మిగిలాయి. ఈజిప్టులో ద్రవ్యోల్బణం అత్యధికం. దీంతో ఆమెకు వచ్చిన మొత్తం చాలా తక్కువ. పూలు కోసే వారిలో అత్యధికులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. కాగా, హెబా 10 ఏళ్ల కుమార్తె బస్మల్లాకు తీవ్రమైన కంటి అలర్జీ ఉంది. పూలు కోయడం కొనసాగిస్తే, ఆమె దృష్టి దెబ్బతింటుందని డాక్టర్ చెప్పారు.
ఈజిప్టు మల్లెపూల పరిశ్రమలో 30 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎంతమంది పిల్లలు ఉంటారో కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే, ఓఅంచనా ప్రకారం 5 నుంచి పదివేల మంది పిల్లలను పనిలో ఉపయోగిస్తున్నారని భావించవచ్చు. ఈ దేశంలో రాత్రి 7-ఉదయం 7 మధ్య 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు పని చేయడం చట్టవిరుద్ధమైనా.. వారిని పనుల్లో కొనసాగిస్తున్నారు.