Begin typing your search above and press return to search.

మహా సీఎం శిందేకు ఏమైంది..? ఆరోగ్యం ఆందోళనకరం..

మహారాష్ట్ర రాజకీయం మహా మలుపులు తిరుగుతోంది. ఎప్పుడో గత నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడగా.. ఇప్పటికీ సీఎం ఎంపిక తేలలేదు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 9:39 AM GMT
మహా సీఎం శిందేకు ఏమైంది..? ఆరోగ్యం ఆందోళనకరం..
X

మహారాష్ట్ర రాజకీయం మహా మలుపులు తిరుగుతోంది. ఎప్పుడో గత నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడగా.. ఇప్పటికీ సీఎం ఎంపిక తేలలేదు. నవంబరు 20న జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ అత్యధిక (132) సీట్లు గెలుచుకున్నా.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అన్న స్పష్టత రాలేదు. ఇక సోమవారం జరగాల్సిన కీలక సమావేశం రద్దయింది. అనారోగ్యం పేరుతో శివసేన అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఇంటి నుంచి బయటకు రాలేదు. ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ మాత్రం ఢిల్లీ వెళ్లారు. దీంతో అసలు మహాయుతి భేటీ జరగలేదు. కాగా, మహారాష్ట్ర పర్యవేక్షకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీలను బీజేపీ నియమించింది. బుధవారం వీరు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు. అనంతరం శాసనసభా పక్షనేత ఎంపికపై నిర్ణయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తారు.

5న ముహూర్తం ఉండగా..

సీఎం ప్రమాణం ఈ నెల 5న కాగా.. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక తేదీ 4న జరగనుంది. వాస్తవానికి దీనికిముందే శాసనసభా పక్ష నేత ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, వాయిదా పడింది.

శిందే ఎత్తులు..?

గత వారం ఏక్ నాథ్ శిందే చర్చలను అనూహ్యంగా ఆపేసి.. తన సొంత గ్రామం వెళ్లిపోయారు. అనంతరం ఆయనకు జ్వరంగా ఉందనే కథనాలు వచ్చాయి. ఇక గొంతు ఇన్ఫెక్షన్‌ తో ఈ సోమవారం అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు.

ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందా..?

సీఎం పదవిపై శిందే అనేక డిమాండ్లు పెడుతున్నారు. తనకు మళ్లీ పదవి ఇవ్వాలని లేదంటే తన కుమారుడిని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నారు. హోం, ఆర్థిక శాఖలు తమకే కావాలని కోరుతున్నారు. అసలు కూటమి సమావేశాలకూ ఆయన హాజరుకావడం లేదు. మంగళవారం మరో కీలక విషయం బయటపడింది. శిందే ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందట. ఆరోగ్య స్థితిలో మార్పు లేకపోవడంతో ఆయన థానేలోని ఆస్పత్రిలో చేరారట. శిందేకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.