Begin typing your search above and press return to search.

'మహా' వేడి: కోలుకోని షిండే.. హస్తినలో అజిత్ పవార్ అందుకేనా?

అవును... మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం ఇప్పుడు బీజేపీకి అతి క్లిష్ట సమస్యగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 Dec 2024 4:28 PM GMT
మహా వేడి: కోలుకోని షిండే..  హస్తినలో అజిత్  పవార్  అందుకేనా?
X

కూటమిలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కంటే ఎన్నికల్లో గెలవడమే ఈజీ అని బీజేపీ అధిష్టాణం పెద్దలు భావించినా అతిశయోక్తి కాదేమో అనే చర్చ మొదలైంది! ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఫైనల్ చేయడం బీజేపీ పెద్దలకు కత్తిమీద సాములా తయారైందని అంటున్నారు.

అవును... మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం ఇప్పుడు బీజేపీకి అతి క్లిష్ట సమస్యగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 132 సీట్లు సాధించి కూటమిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే సాహసం చేయడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. మరాఠా వర్గానికి చెందిన షిండేనే దీనికి కారణం అని అంటున్నారు.

వాస్తవానికి మహారాష్ట్రలో మరాఠాలు ఎక్కువగా ఉన్నారు. ఒక వేళ మరాఠా వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా.. మరో వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏమి జరుగుతుందో అనే భయాందోళనలు బీజేపీ పెద్దల్లో నెలకొన్నాయని అంటున్నారు. మరోపక్క అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షిండే తన సొంత గ్రామంలోనే ఉన్నారు.. ఇంకా కోలుకోలేదని చెబుతున్నారు.

దీంతో.. సోమవారం ముంబైలో జరగాల్సిన ఎన్డీయే సమావేశం వాయిదా పడింది! దీంతో... సీఎం అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మరోపక్క డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. పరిస్థితి చూస్తుంటే ఆ ముహూర్తం దాటిపోయినా ఆశ్చర్యం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే అంశంపై మహాయుతి కూటమిలో ఇప్పటివరకూ క్లారిటీ రాని వేళ.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆయన బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారని, ప్రధానంగా మంత్రి పదవులపై చర్చ ఉంటుందని అంటున్నారు. దీంతో... అజిత్ పవార్ హస్తిన టూర్ పై ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇదే సమయంలో... మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరు దాదాపు ఖరారైందని.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయంటూ కథనాలు వస్తున్నాయి. అయితే... షిండే ఆరోగ్యం కుదుటిపడిన తర్వాత దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన.. ఆయన సమక్షంలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాగా... మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ - 132, షిండే శివసేన - 57, ఎన్సీపీ - 41 స్థానాలు దక్కించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుండగా.. ఉద్ధవ్ థాక్రే శివసేన - 20, కాంగ్రెస్ - 16, ఎన్సీపీ (శరద్ పవార్) - 10 సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు!