Begin typing your search above and press return to search.

రగిలిపోతున్న షిండే...ముదురిన మహా రాజకీయం

మహారాష్ట్రలో కనీ వినీ ఎరగని మెజారిటీ వచ్చింది అని బీజేపీ పెద్దలు సంతోషించే లోపే విషాద పర్వాలు కూడా చోటు చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 3:38 AM GMT
రగిలిపోతున్న షిండే...ముదురిన మహా రాజకీయం
X

మహారాష్ట్రలో కనీ వినీ ఎరగని మెజారిటీ వచ్చింది అని బీజేపీ పెద్దలు సంతోషించే లోపే విషాద పర్వాలు కూడా చోటు చేసుకుంటున్నారు. ఆగ్రహ జ్వాలలు కూడా మిన్నంటుతున్నాయి. నిన్నటిదాకా మహారాష్ట్ర వంటి సంపన్న రాష్ట్రానికి సీఎం గా ఉన్న ఏక్ నాథ్ షిండే తన పదవిని రాజీనామా చేసి గవర్నర్ కి ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉన్నారు. అయితే షిండే ముఖంలో ఏ మాత్రం నవ్వు కనిపించలేదు. లాంచనంగా ఆయన గవర్నర్ తో మాట్లాడి వెళ్ళిపోయారు

ఇంకో వైపు షిండేని సీఎం చేయాల్సిందే అని ఆయన వర్గం ఎమ్మెల్యేలు నినదిస్తున్నారు. మహారాష్ట్రలో ఉత్తమ సీఎం గా షిండే పేరునే జనాలు ఎక్కువగా చెప్పారని ఆయన రెండేళ్ళ ప్రజా రంజక పాలన వల్లనే మహాయుతి కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయని చెబుతున్నారు.

అయితే మరో వైపు బీజేపీ అధినాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం చేయడానికి చూస్తోంది అని అంటున్నారు. దాదాపుగా అది ఖాయమైంది అని అంటున్నారు ఒకటి రెండు రోజులలో దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలతో కలత చెందిన ఏక్ నాథ్ షిండే పూర్తి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు

ఆ మౌనం వెనక ఏముంది అన్నది ఎవరికీ తెలియడం లేదు. మొత్తం 57 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న షిండే రగిలిపోతున్నారని అంటున్నారు. అది మహా సంక్షోభానికి దారి తీస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది.

అయితే షిండేకి కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన దానికి ససేమిరా అంటున్నారని భోగట్టా. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతాను అని అంటున్నారు. అయితే ఆయనకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఏమిటి అని ఆయన అనుచరులు మండిపడుతున్నారు

అయితే గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విధంగా సీఎం గా చేసి డిప్యూటీ సీఎం చేశారు కదా అని గుర్తు చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ఎంతో బలంతో పాటు సామాజిక వర్గం దన్ను ఉన్న షిండే ఈ ఆఫర్లను అంగీకరించడం లేదని అంటున్నారు. ఆయన సీఎం పదవినే కోరుకుంటున్నారు అని అంటున్నారు

ఈ నేపధ్యంలోనే మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ హై కమాండ్ తేల్చడంలేదని అంటున్నారు. దాంతో ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే షిండే విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవేంద్ర ఫడ్నవిస్ నే ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన కుండబద్ధలు కొట్టారు. దీంతో ఈ విషయం మీద ఏక్ నాథ్ షిండే సంతోషంగా లేరని చెప్పారు. ఆయన పూర్తిగా అసంతృప్తితో ఉన్నారని అందువల్ల దానిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అదే సమయంలో వర్తమాన రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకుని దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో పనిచేసే విషయంపై షిండే ఆలోచించాలని కూడా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే షిండే దగ్గర 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహా వికాస్ అఘాడీ వద్ద 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు కలిస్తే 106 నంబర్ అవుతుంది. ఇది రాజకీయంగా పెద్ద నంబరే. ఈ రోజుకు కాకపోయినా రేపు అయినా ఈ నంబర్ తో డేంజరే. అందువల్ల విపక్షం వైపుగా షిండే మళ్లకుండా బీజేపీ హైకమాండ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి ఉందని అంటున్నారు