చీల్చేశా..నన్ను తేలిగ్గా తీస్కోవద్దు..ఫడణవీస్ గడ్డపై తొడగొట్టిన శిందే!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే ‘నన్ను తేలికగా తీసుకోకండి’ అంటూ హెచ్చరికలతో కూడిన సూచనలు చేయడం కలకలం రేపుతోంది.
By: Tupaki Desk | 22 Feb 2025 6:42 AM GMTఎంతో క్లిష్ట పరిస్థితుల మధ్య కొలువుదీరిన మహారాష్ట్ర ప్రభుత్వంలో అంతా సవ్యంగా ఏమీ లేదా..? సీఎం పదవి దక్కనందుకు ఏక్ నాథ్ శిందే చిందులు తొక్కుతున్నారా..? శివసేనను చీల్చి తానేం చేశానో చెబుతూ హెచ్చరికలు పంపుతున్నారా? వీటన్నిటికీ ఔననే సమాధానమే వస్తోంది.
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల ముంగిట మహాయుతి కూటమిలో విభేదాలు ఉన్నట్లుగా జరుగుతున్న సమయంలో శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే ‘నన్ను తేలికగా తీసుకోకండి’ అంటూ హెచ్చరికలతో కూడిన సూచనలు చేయడం కలకలం రేపుతోంది.
శుక్రవారం నాగపూర్ లో శిందే విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఓ సాధారణ కార్యకర్తను. బాబాసాహెబ్ (బాల్ థాక్రే) అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. 2022లో నన్ను తేలిగ్గా తీసుకున్నారు. కానీ, అప్పటి ప్రభుత్వాన్ని పడగొట్టా’ అంటూ శిందే వ్యాఖ్యానించారు. కాగా, నాగపూర్ ప్రాంతం మహారాష్ట్ర సీఎం సొంత దేవేంద్ర ఫడణవీస్ సొంత ప్రాంతం. అక్కడే శిందే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అనంతరం శిందే తన వ్యాఖ్యలు కొనసాగిస్తూ.. డబుల్ ఇంజిన్ సర్కారు (తన ప్రభుత్వం) పూర్తివేగంతో పనిచేస్తోందని చెబుతూ.. ఎన్నికల్లో 200 పైగా స్థానాల్లో గెలుస్తామని తాను, ఫడణవీస్ చెప్పామన్నారు. అందుకుతగ్గట్లే 232 సీట్లలో గెలిచామని పేర్కొన్నారు. దీన్ని ఉదాహరిస్తూ ‘నన్ను తేలికగా తీసుకోవద్దు. అర్థం చేసుకునే వారికి ఈ సూచన సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (శిందే)లతో కూడిన మహాయుతి ప్రభుత్వంలో కొంతకాలంగా విభేదాలు ముదిరినట్లు కథనాలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్దుబాటు గురించి కూడా కుమ్ములాటలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిందేకు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తో విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకనే శిందే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శిందే మాటలను బట్టి చూస్తే అవసరమైతే తాను ఎంతకైనా తెగిస్తాననే సంకేతం ఇచ్చినట్లుంది. అయితే, మహారాష్ట్రలో బీజేపీకి సాధారణ మెజారిటీకి కాస్త తక్కువగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలాగూ ఎన్సీపీ (అజిత్ పవార్) మద్దతు ఉంది. కాబట్టి శిందే ఏమీ చేయలేకపోవచ్చు. అవసరమైతే శిందే పార్టీనే బీజేపీ చీల్చే చాన్సుంది.