Begin typing your search above and press return to search.

బాణం.. విల్లు.. 'అసలు పార్టీ' కూడా ఆయన వశమైపోయి

దివంగత బాల్ థాకరే 1966లో స్థాపించిన శివసేన ఇప్పుడు పూర్తిగా ఆయకు కుమారుడు ఉద్ధవ్ థాకరే చేతిలోంచి వెళ్లిపోయింది

By:  Tupaki Desk   |   11 Jan 2024 12:30 AM GMT
బాణం.. విల్లు.. అసలు పార్టీ కూడా ఆయన వశమైపోయి
X

ప్రాంతీయ పార్టీల్లో 50 ఏళ్లకు పైగా కొనసాగిన అతికొన్ని పార్టీల్లో ఒకటైన ఆ పార్టీలో కీలక పరిణామం.. రాజకీయ పార్టీకి ప్రాణాధారమైన గుర్తులను కోల్పోయిన వ్యవస్థాపకుడి కుటుంబం.. ఇప్పుడు అసలు పార్టీ ఏదనే విషయంలోనూ ఎదురుదెబ్బతిన్నది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రతిపక్ష ఇండియా కూమినీ ప్రభావితం చేయనుంది.

దివంగత బాల్ థాకరే 1966లో స్థాపించిన శివసేన ఇప్పుడు పూర్తిగా ఆయకు కుమారుడు ఉద్ధవ్ థాకరే చేతిలోంచి వెళ్లిపోయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏడాదిన్నరగా సాగుతున్న డ్రామాకు తెరపడింది. 2022 జూన్ లో ఉద్ధవ్ సీఎంగా ఉండగా.. శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ శిందే తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో ఉద్ధవ్ ప్రభుత్వం పడిపోయింది. శివసేన.. ఉద్ధవ్, శిందే వర్గాలుగా చీలిపోయింది. బీజేపీ మద్దతుతో శిందే సీఎం అయ్యారు. ఇప్పుడు 'అసలు శివసేన'కూ ఆయనే అధిపతి అయ్యారు.

సుప్రీం ఆదేశాల గడువు చివరి రోజున

సీఎం శిందే వర్గమే అసలైన శివసేన అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఆదేశాలు వెలువరించారు. కాగా, 50 మంది ఎమ్మెల్యేలతో 2022 జూన్ నాటి శిందే తిరుగుబాటు పరిణామాల అనంతరం ఫిరాయింపులపై ఉద్ధవ్‌, ఏక్‌ నాథ్‌ శిందే వర్గాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ జనవరి 10లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బుధవారం స్పీకర్‌ నర్వేకర్ నిర్ణయాన్ని ప్రకటించారు. శిందే వర్గానికే అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారన్న స్పీకర్‌.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ తిరస్కరించారు.

2018 రాజ్యాంగమే చెల్లుతుంది..

శిందే వర్గమే అసలైన శివసేన అని నిర్ణయం ప్రకటించిన స్పీకర్.. ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయమూ తీసుకున్నారు. శివసేన పార్టీ 2018 రాజ్యాంగాన్ని పరిగణించాలన్న ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థనను పరిగణించలేదు. ఎన్నికల సంఘానికి 1999లో సమర్పించిన శివసేన రాజ్యాంగమే చెల్లుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ రాజ్యాంగం ప్రకారం.. శివసేన ప్రముఖ్‌ గా ఉన్న వారికి ఏ నేతనూ తొలగించే అధికారం ఉండదు. అంటే.. ఉద్ధవ్‌ కు ఎవరినీ తొలగించే అవకాశం లేదన్నమాట.

విశ్వాస పరీక్ష లింకు..

శిందే తిరుగుబాటు అనంతరం.. సుప్రీం కోర్టు అనుమతితో ఉద్ధవ్‌ బల పరీక్ష ఎదుర్కొనాలని గవర్నర్‌ కోరారు. అయితే, ఉద్ధవ్‌ ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. తర్వాత శిందే వర్గం- బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. జూన్‌ 30న శిందే సీఎంగా నియమితులయ్యారు. 2022 జూలై 4న అసెంబ్లీలో బలపరీక్షలో విజయం సాధించారు. కాగా, శివసేన ఎన్నికల గుర్తు విల్లు, బాణం. 2022 అక్టోబరులో దీనిని కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. 2023 ఫిబ్రవరిలో శిందే వర్గానికి కేటాయించింది. దీనిపై ఉద్ధవ్‌ వర్గం సుప్రీం కోర్టుకెళ్లింది. ఇక్కడే సుప్రీం కీలక తీర్పు వెల్లడించింది. ఉద్ధవ్.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడానికి ముందే రాజీనామా చేసినందున శిందే ప్రభుత్వంపై అనర్హత వేటు వేయలేమని, ఉద్ధవ్‌ ను మళ్లీ సీఎంగా నియమించలేమని తేల్చింది. శిందే వర్గ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై 2024 జనవరి 10లోగా నిర్ణయం తీసుకోవాలని డిసెంబరులో మహారాష్ట్ర స్పీకర్‌ను ఆదేశించింది.