వామ్మో.. మహారాష్ట్రలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంత మంది ఉన్నారా..?
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడి రాష్ట్ర ఓటర్ల లిస్టును ప్రకటించింది.
By: Tupaki Desk | 1 Nov 2024 5:30 PM GMTమరికొన్ని రోజుల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. అధికార, విపక్షాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పెద్ద రాష్ట్రం కావడంతో.. ఇక్కడ పాగా వేయాలని ప్రతీ పార్టీ కూడా కత్తులు నూరుతోంది. అధికారమే ధ్యేయంగా సిద్ధం అవుతున్నాయి.
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడి రాష్ట్ర ఓటర్ల లిస్టును ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తంగా 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 5 కోట్ల మందికి పైగా పురుష ఓటర్లు ఉండగా.. 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరిలో రెండు శాతం మంది ఓటర్లు మొదటిసారి ఓటు వేయబోతున్నారు. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.
ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి రాష్ట్రంలో 9.63 మంది ఓటర్ల ఉండగా.. ఆ తర్వాత కొత్తగా 6.55 లక్షల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దాంతో ఆ సంఖ్య 9.7 కోట్లకు చేరుకుంది. ఇక 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో 72 లక్షల వరకు ఓటర్ల సంఖ్య పెరిగింది. పుణె జిల్లాలో అత్యధికంగా 88.49 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత ముంబయి సబర్బన్‌లో 76.86 లక్షలు ఉన్నారు. ఆ తర్వాత ఠాణెలో 72.29 లక్షలు, నాసిక్‌లో 50.61 లక్షలు, నాగ్‌పూర్‌లో 45.25 లక్షలు, ముంబయి నగరంలో 23.43 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. అత్యల్పంగా సింధ్‌దుర్గ్‌లో 6.7 లక్షల మంది ఉన్నారు.
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ అంశం ఏంటంటే.. రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉంటే 100 ఏళ్ల వయసు పైబడిన వారు ఏకంగా 47,392 మంది ఓటర్లు ఉండడం గమనార్హం. వీరంతా మరోసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కాగా.. వీరిలో ఓ ఓటరు వయసు 109 ఏళ్లు. అత్యంత వృద్ధ ఓటరు కూడా వీరే. కాగా.. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడతలో ఈనెల 20న పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తరువాత ఫలితాలు వెల్లడికానున్నాయి.