ఏపీలో రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్... ఎవరికి ఛాన్స్?
ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ కు మూడు, ఒడిశా, హర్యానా, బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
By: Tupaki Desk | 26 Nov 2024 10:06 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యం లో తాజాగా రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
అవును... ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) షెడ్యూల్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ కు మూడు, ఒడిశా, హర్యానా, బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10ని నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇక డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుండగా.. 13వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. అదే రోజు 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని ఈసీ తెలిపింది.
కాగా... ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ నుంచి రాజ్యసభ్యులుగా ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం శూన్యంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పెద్దల సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే.. కూటమికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో.. ఈ మూడు స్థానాలు వారికే దక్కే అవకాశం ఉంది.
అయితే... ఈ మూడు స్థానాలు కూటమిలోని మూడు పార్టీలూ ఎలా పంచుకుంటాయనేది ఆసక్తిగా మారింది. వీటిలో మూడు పార్టీలూ చెరొకటి తీసుకుంటాయా.. లేక, వేరే రకంగా పంపకాలు జరగబోతున్నాయా అనేది వేచి చూడాలి!