Begin typing your search above and press return to search.

సో కాల్డ్ జ్యోతిష్యులకు బిగ్ ఆఫర్... ఎన్నికల ఫలితాలపై రూ. కోటి రివార్డ్!

ఇటీవల కాలంలో ఎన్నికల సందడి మొదలైందంటే... వాటికనుగుణంగా పలు సంస్థల సర్వే ఫలితాల సందడి కూడా మొదలైపోతుంది.

By:  Tupaki Desk   |   11 Nov 2024 10:16 AM GMT
సో కాల్డ్  జ్యోతిష్యులకు బిగ్  ఆఫర్... ఎన్నికల ఫలితాలపై రూ. కోటి రివార్డ్!
X

ఇటీవల కాలంలో ఎన్నికల సందడి మొదలైందంటే... వాటికనుగుణంగా పలు సంస్థల సర్వే ఫలితాల సందడి కూడా మొదలైపోతుంది. ఇటీవల కాలంలో అవి కూడా పార్టీల పరంగా విడిపోయి.. కార్యకర్తలను, ఓటర్లను వంచించే పనికి పూనుకున్నాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించారు.

అవును... ఇటీవల కాలంలో పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్న ఎన్నికల అంచనాలు బెట్టింగు రాయుళ్లకు అనుకూలంగా కొన్ని ఉంటుంటే.. ఓటర్లను ప్రొవోక్ చేసేలా మరికొన్ని ఉంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకటి రెండు ఫలితాలు చీకట్లో బాణాలుగా తగులుతున్నాయనే కమెంట్లూ వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గల ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దేవి అహల్యా బాయి యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఓ బహూమతిని ప్రకటించారు. ఇందులో భాగంగా రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా అంచనా వేసిన వ్యక్తికి రూ. కోటి బహుమతి ఇస్తానని ప్రకటించారు.

ఈ యూనివర్శిటీలోని కాంపిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీఎన్ మిశ్రా... విజువల్, ప్రింట్ మీడియా అయినా.. లేక, సోది చెప్పే వారైనా సరే ఈ సవాల్ ని స్వీకరించాలని.. రెండు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సీట్ల వారిగా సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఈ ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చని అన్నారు.

అయితే... ఈ సవాలును స్వీకరించిన వారు సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైతే మాత్రం బహిరంగ క్షమాపణలు చెప్పాలని షరతు విధించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... సో కాల్డ్ జ్యోతిష్యులు, చేతబడులు చేసేవారు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా పోల్ అంచనాలు వేస్తూ సమాజంలో మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదే సమయంలో.. పోల్ ఫలితాలను అంచనా వేసే మీడియా సంస్థలు కూడా తమ పద్దతి శాత్రీయమైనదని రుజువు చేయాలని ఆయన సవాలు విసిరారు. తాను కాంపిటేటివ్ టెక్నిక్స్ & స్టాటస్టిక్స్ ప్రొఫెసర్ అని.. తనకు శాంపిల్స్ ని ఎలా విశ్లేషించాలో బాగా తెలుసని అన్నారు. భారీ సంఖ్యలో ఉన్న ఓటర్ల నుంచి 1000, 2000 శాంపుల్స్ తో ఎలా అంచనా వేయగలరని ప్రశ్నించారు!