దొరికిపోయిన ఎంవీవీ 'తాయిలాలు'!
గత శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించిన సోదాలు.. అర్ధరాత్రి దాటిన తర్వాత.. 2 గంటల వరకు కూడా కొనసాగాయి.
By: Tupaki Desk | 4 May 2024 12:30 PM GMTఎంవీవీ సత్యనారాయణ. వైసీపీ విశాఖ పట్నం ఎంపీ. ప్రస్తుతం ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం.. ఆయన తాయిలాలు పంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన కార్యాల యంపై దాడులు చేసిన ఎన్నికల సంగం నిఘా బృందం.. భారీ సంఖ్యలో చీరలు.. నగదు, ఇతక సామగ్రిని స్వాధీనం చేసుకుంది. టీడీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు.. అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు సమాచారం. గత శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించిన సోదాలు.. అర్ధరాత్రి దాటిన తర్వాత.. 2 గంటల వరకు కూడా కొనసాగాయి.
ఏం జరిగింది?
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ నాయకుడు వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారు. ఈయన ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ.. ముందున్నారు. దీంతో ఎలాగైనా ఈయనను ఓడించాలనేది.. పార్టీ పెట్టుకున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎంపీగా ఉన్న ఎంవీవీ ఇక్కడ టికెట్ దక్కించుకున్నారు. వాస్తవానికి ఎంపీగా ఉన్న ఎంవీవీపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో వైసీపీకి అనూహ్యమైన నిరసన వ్యక్తమవుతోంది. దీని నుంచి బయట పడేందుకు.. ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారనేది టీడీపీ నేతల ఆరోపణ.
ఈ క్రమంలోనే టీడీపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం నిఘా బృందం కొన్నాళ్లుగా ఎంవీవీపై నిఘా పెట్టింది. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి.. ఆయన కార్యాలయంపై దాడులు చేసింది. ఈ సమయంలో ఎంవీవీ సత్యనారాయణ, ఆయన సన్నిహితుడు.. జీ. వెంకటేశ్వరరావు అక్కడే ఉన్నారు. వీరిని ఓ గదిలో కూర్చోబెట్టిన అధికారులు.. మిగిలిన కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని సెర్చ్ చేశారు. ఈ క్రమంలో వారికి వందల కొద్దీ చీరలు, ఇతరత్రా సామాగ్రి పట్టుబడింది. అదేవిధంగా రూ.500 నోట్ల కట్టలు కూడా గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు.