Begin typing your search above and press return to search.

ఎన్నికల కేబినెట్ ఎన్నో ఆశల్ని మోసుకొచ్చింది

భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిన అంశాల్ని ప్రజల వద్దకు వెళ్లేలా తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో చర్చ జరిగింది

By:  Tupaki Desk   |   1 Aug 2023 5:24 AM GMT
ఎన్నికల కేబినెట్ ఎన్నో ఆశల్ని మోసుకొచ్చింది
X

ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. కీలకమైన ఎన్నికలకు కాస్త ముందుగా ప్రభుత్వ విధానాలు.. తదుపరి చర్యలు.. భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిన అంశాల్ని ప్రజల వద్దకు వెళ్లేలా తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. మధ్యాహ్నం మొదలైన మంత్రివర్గ సమావేశం రాత్రి వరకు సా.. గింది. కేబినెట్ భేటీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. ఆ కారణంగా వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. వరద కష్టాల మీదా.. ప్రభుత్వం అందించిన సాయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. సుదీర్ఘ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సహచర మంత్రులు.. కొందరు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేబినెట్ భేటీకి సంబంధించిన కీలక అంశాల్ని ప్రస్తావించారు. అవేమంటే..

⦁ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం..దాదాపు 10 జిల్లాల్లో కురిసిన చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాల వల్ల ప్రజలకు జరిగిన నష్టం విషయంలో తక్షణ సహాయం కింద రూ.500 కోట్లను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడ అవసరముంటే అక్కడ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు, తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆదేశించారు.

⦁ వరదల్లో తరలించిన దాదాపు 27 వేల మందికి పునరావాసం కల్పించి, భద్రంగా ఉంచేలా ఆదేశం.విద్యుత్ శాఖకు సంబంధించి ఇద్దరుఉద్యోగులకు ఆగస్టు 15న ప్రత్యేకంగా సత్కరించాలన్న నిర్ణయం. ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న పాయెం మీనయ్య అనే ఉపాధ్యాయుడు 40 మంది పిల్లలను కాపాడినందుకు అభినందించి సన్మానం చేయాలని నిర్ణయించారు.

⦁ ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడుగునా ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం. వర్షాలతో కొంత ఇబ్బంది కలిగినా రైతులకు అవసరమైన విత్తనాలు.. ఎరువులు అందుబాటులో ఉండాలి. వర్షాల్లో మరణించిన 40 మందికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. వరదలతో జరిగిన నష్టంపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికలు ఇవ్వాలి. వరదలతో తెగిన కల్వర్టులు.. రోడ్లను తక్షణమే రిపేర్లు చేయాలి.

⦁ టీఎస్ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన కార్మికులు, ఉద్యోగులందరి విషయంలో రవాణా మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్, ఆర్థిక మంత్రి, వారితో దగ్గరి సంబంధమున్న మిగతా మిత్రులు వారి తరపున సీఎం గారికి నివేదించడం జరిగింది.

⦁ టీఎస్ ఆర్టీసీని, ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం. విధివిధానలకు ఒక సబ్ కమిటీ. ఆర్టీసీకి చెందిన 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం. ఆగస్టు 3న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగులు.. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను మొదలు పెట్టాలి.

⦁ తెలంగాణకు గుండెకాయ లాంటి మహానగరం. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు మౌలిక వసతుల విషయంలో అవుటర్ రింగు రోడ్డు చుట్టూ మెట్రోను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం. మొత్తం రూ.69,100 కోట్ల భారీ ఖర్చుతో నాలుగేళ్ల వ్యవధిలో 278కి.మీ. మేర మహా మెట్రో నిర్మాణం. కేంద్రం నుంచి సాయం అందకుంటే సొంతంగా మహా మెట్రో నిర్మాణం.

⦁ దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనాథ పిల్లల సంరక్షణ కోసం చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్ గా గుర్తిస్తూ ఒక పాలసీని రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం.

⦁ గవర్నర్ కోటాలో శాసనమండలికి ఇద్దరు సభ్యుల ఎంపికకు కేబినేట్ ఆమోదం . ఎరుకల సామాజికవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కుర్రా సత్యనారాయణను ఒక అభ్యర్థిగా, బలహీనవర్గాలకు సంబంధించి బలమైన గొంతు డాక్టర్ దాసోజు శ్రవణ్ లను గవర్నర్ నామినేషన్ ప్రకారం శాసనమండలి సభ్యులుగా ఎంపిక.

⦁ దాదాపు 50 అంశాల దాకా కేబినేట్ లో చర్చ జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక హార్టికల్చర్ కళాశాలకు కేబినేట్ ఆమోదం.

⦁ హైదరాబాద్ లో నిర్మించనున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతిపాదనకు ఆమోదం. గడ్డి అన్నారంలో, సనత్ నగర్ లో, గచ్చిబౌలిలో, అల్వాల్ లలో నాలుగు చోట్లా 50 శాతం జనరల్ కన్సల్టేషన్ పద్ధతిలో అంటే ఉస్మానియా, గాంధీ తరహాలో 50 శాతం పడకలు, మిగతా 50 శాతం నిమ్స్ తరహాలో ఈ హాస్పిటల్స్ ను నిర్మించాలని వైద్యశాఖను కేబినేట్ ఆదేశం. నిమ్స్ లో మరో 2 వేల పడకలకు అవసరమైన రూ.1800 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం.

⦁ బీడీ కార్మికులకు ఇప్పటికంటే అందనంగా రూ.2016చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం. బీడీ టేకీదారులకు పెన్షన్లు. వరంగల్ లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు ఆదేశాలు. పూణే, గోవాలో మాదిరి రక్షణ శాఖ, పౌర విమాన సేవలకు ఉపయోగించుకుంటారో హకీంపేట ఎయిర్ పోర్ట్ ని అలా చేయాలని కోరుతూ కేంద్రానికి వినతి.

⦁ దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి తదితర కాపు కులాల అభ్యర్థన మేరకు సౌత్ ఇండియా ఫర్ కాపు కమ్యూనిటీ ఏర్పాటు కోసం స్థలం ఇస్తూ నిర్ణయం. ఇప్పుడున్న మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 8 మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం.