Begin typing your search above and press return to search.

ఓటర్ల కోరికకు అంతులేదు.. అభ్యర్థుల చేతికి ఎముక లేదు!

అవును... పోలింగ్‌ కు మరో ఎనిమిది, తొమ్మిది రోజుల సమయం ఉండగానే కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే సుమారు రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు కోరికల ఖర్చులు పూర్తిచేసినట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 12:30 AM GMT
ఓటర్ల కోరికకు అంతులేదు.. అభ్యర్థుల  చేతికి ఎముక లేదు!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లిన అభ్యర్థులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయని.. అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదని.. వీటన్నింటికీ కారణం ఓటర్లు కోరుతున్న కోరికలని అంటున్నారు. ఈ సమయలో అడిగేవారికి కోరికకు అంతులేదు.. ఇచ్చే అభ్యర్థుల చేతికి ఎముకా లేదు అన్న చందంగా వ్యవహారం సాగిపోతుందని తెలుస్తుంది. దీంతో ఇప్పటికే పలువురి అభ్యర్థుల ఖర్చు చాలా దూరం వెళ్లిపోయిందని సమాచారం.

అవును... పోలింగ్‌ కు మరో ఎనిమిది, తొమ్మిది రోజుల సమయం ఉండగానే కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే సుమారు రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు కోరికల ఖర్చులు పూర్తిచేసినట్లు తెలుస్తుంది. సభలు, ప్రచారానికి జనం తరలింపు, వాహనాల ఖర్చులు, రెగ్యులర్ గా వెనుక తిరిగే జనాలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ విత్ లిక్కర్, బైక్ లలో పెట్రోలు, కార్లలో డీజిల్ వెరసి తడిచి మోపెడవుతుందని అంటున్నారు.

ఈ సమయంలో ఓట్లు అడగడానికి ఊర్లోకి వెళ్తున్న అభ్యర్థులకు ఊరి ముందు గుడి దగ్గర నుంచి కోరికలు మొదలవుతున్నాయని తెలుస్తుంది. కొత్త ఆలయాల నిర్మాణాలు, దెబ్బతిన్న ఆలయాల పునర్నిర్మాణాలకు నిధుల నుంచి మొదలు... సామాజిక వర్గాల సంఘాల ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారట. పైగా కార్తీక మాసం కావడంతో వరుసపెట్టి వన సమారాధనలు, వన భోజనాల ఏర్పాటుకు ఖర్చుల లిస్ట్ కూడా అభ్యర్థుల చేతికి వెళ్లిపోతుందని తెలుస్తుంది.

మరోపక్క ఇప్పటికే పలుచోట్ల కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, పట్టు చీరల పంపిణీ పూర్తయ్యిందని పలువురు చెబుతుండగా... ప్రతి ఆదివారం గ్రామానికి రెండు పొట్టేళ్ల చొప్పున వితరణ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ గ్యాప్ లో ఆలయాల పునర్నిర్మాణానికి రూ.5 లక్షలు, నూతన ఆలయ నిర్మాణానికి సుమారు రూ. కోటి, కుల సంఘాల సంక్షేమ భవనాలకు రూ.50 లక్షలు, గ్రామాల్లో కమాన్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, యువతకు క్రీడా సామగ్రికి రూ.2 లక్షలు, యువజన సంఘాలకు డీజే కిట్‌ కు రూ.3 లక్షలు ఈ స్థాయిలో సాగుతుందంట వితరణల పర్వం!

ఈ స్థాయిలో ఇప్పుడే ఇంత చేస్తుంటే.. గెలిస్తే మరెంతో చేస్తానని కొత్తగా పోటీ చేస్తున్న నేతలు చెబుతుంటే... మరొక్కసారి అవకాశం ఇవ్వండని సీనియర్లు.. ఓటర్లను ప్రాధేయపడుతున్నారట. దీంతో ఇంతా చేశాక గెలిస్తే పర్లేదు కానీ... ఓడిపోతే మాత్రం ఆ అభ్యర్థి తేరుకోవడానికి చాలా కాలమే పట్టొచ్చని అంటున్నారు పరిశీలకులు!