Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాలు మోడీలో ఎంత మార్పు తెచ్చాయంటే?

400 ప్లస్ సీట్లు పక్కానంటూ ఢంకా బజాయించినట్లుగా ప్రచారం చేసుకొని.. తమకు తాముగా సొంతంగా 370సీట్ల మార్కును అలవోకగా దాటేస్తున్నట్లుగా చెప్పారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 6:30 AM GMT
ఎన్నికల ఫలితాలు మోడీలో ఎంత మార్పు తెచ్చాయంటే?
X

అవును.. ఆయన మోడీ. నరేంద్ర మోడీ. తన సమ్మోహక మాటలతో ప్రజల్ని.. ఓటర్లను మంత్రముగ్ధుల్ని చేయటమే కాదు.. తాను అనుకున్న ఫలితాన్ని ఎప్పటికప్పుడు సాధించే ఆయన మేజిక్ తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎదురు తిరిగింది. 400 ప్లస్ సీట్లు పక్కానంటూ ఢంకా బజాయించినట్లుగా ప్రచారం చేసుకొని.. తమకు తాముగా సొంతంగా 370సీట్ల మార్కును అలవోకగా దాటేస్తున్నట్లుగా చెప్పారు. ఏడు దశల్లో సాగిన సార్వత్రికక ఎన్నికల పోలింగ్ మధ్యకు వచ్చేసరికి తమకు 200 సీట్లు వచ్చేశాయంటూ మోడీషాల నోటి నుంచి వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తీరా ఈవీఎంలు ఓపెన్ అయి.. ఓట్ల లెక్కింపు తర్వాత కానీ ఓటరు ఇచ్చిన షాక్ తో అంత పెద్ద మోడీకి సైతం దిమ్మ తిరిగినట్లుగా చెబుతున్నారు. 370 తర్వాత.. ప్రభుత్వాన్నిసొంతంగా ఏర్పాటు చేయటానికి అవసరమైన 272 మార్కునుకూడా దాటించకుండా.. 240 వద్దే ఆపేయటం చూస్తే ప్రజాస్వామ్యమా? మజాకానా? అనుకోకుండా ఉండలేం. దీంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి మిత్రుల అవసరమైంది. పేరుకు ఎన్డీయే కూటమి.. అందులో కొన్ని మిత్రపక్షాలు ఉన్నప్పటికీ.. గడిచిన పదేళ్లలో ఏ సమయంలోనూ వాటి అవసరం మోడీకి ఏర్పడలేదు. దీంతో.. వారంతా అప్రాధాన్యంగా ఉండిపోయారు.

అలాంటిది తాజా సార్వత్రిక ఫలితాలతో మోడీలో చాలానే మార్పు వచ్చినట్లుగా చెప్పాలి. గతానికి భిన్నంగా తాను ఒక్కడినే ఫోకస్ అయ్యే తీరుకు భిన్నంగా.. తనతో పాటు మిత్రపక్షాలను సైతం ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎన్డీయే పక్షాలతో శుక్రవారం జరిగిన సమావేశాన్ని చూస్తే.. కొత్త మోడీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తారు. భాగస్వామ్య పక్షాల గొప్పతనాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాము కలిసి ముందుకు సాగుతామన్న మాట మోడీ నోటి నుంచి వచ్చింది. మొత్తానికి గతంతో పోలిస్తే వర్తమానంలో మోడీలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి.

మోడీలో మార్పు ఎంతలా వచ్చిందన్న దానికి నిదర్శనంగా ఒక ఆసక్తికర ఘటనతో ముగిస్తాం. ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన ఆయన.. సదరు హాల్లోకి ప్రవేశ పెట్టినంతనే.. ఆయన నేరుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకొని వందనం చేయటం గమనార్హం. అక్కడితో ఆయన ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి.. భావోద్వేగ వ్యాఖ్యల్ని ఆ ఫోటోకు జత చేశారు.

తన జీవితంలో ప్రతి క్షణమూ.. రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణమే అంకితమన్న మోడీ.. ‘‘నాలాంటి వెనుకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నానంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనం’’ అంటూ పేర్కొన్నారు. కొసమెరుపు ఏమంటే.. గడిచిన పదేళ్లుగా రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి.. 400 ప్లస్ సీట్ల సాధించిన తర్వాత రాజ్యాంగాన్ని సైతం మార్చేయాలన్నట్లుగా ఆయన వ్యవహరించి.. ఈ రోజున రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలు మోడీనా.. మజకానా? అన్న భావన కలగటం ఖాయం. కాదంటారా?