ఏపీలో అవన్నీ దొంగ ఓట్లేనా.. ఎన్నికల సంఘం సంచలనం!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్లపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతోంది
By: Tupaki Desk | 13 Sep 2023 4:34 AM GMTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్లపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ప్రధాన మీడియా కూడా దొంగ ఓట్ల అంశంపై పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తోంది. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్చిందని వైసీపీ ఆరోపిస్తుండగా వైసీపీనే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చి మళ్లీ గెలవడానికి సిద్ధంగా ఉందని టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఇరు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందజేశాయి. దొంగ ఓట్లను తొలగించాలని కోరాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ లో ఒకే డోర్ నెంబర్ లో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్ల సంఖ్య ఏకంగా 1,57,939గా ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇలా ఒకే డోర్ నంబర్ ఉన్న ఇళ్లల్లో 24,61,676 మంది ఓటర్లు ఉంటున్నట్టుగా తేలిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖ మేరకు ఏపీలో ఓటర్ల సంఖ్యపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సమాధానం ఇచ్చారు. గుర్తు తెలియని డోర్ నెంబర్లు, జీరో నెంబర్లపైనా మరో 2,51,767 మంది ఓటర్లు నమోదై ఉన్నట్టు ఆ లేఖలో తెలిపారు. మొత్తంగా ఏపీలో 27.13 లక్షల పైచిలుకు ఓట్లకు సంబంధించిన తనిఖీ జరుగుతుందని తెలిపారు.
ఒకే డోర్ నెంబర్, జీరో డోర్ నెంబర్ సహా ఒకే ఇంటి నెంబరు పై 10 మంది ఓటర్లు కలిగిన వాటికి సంబంధించి విస్తృతం తనిఖీలు చేసి వాటిని పరిశీలించామన్నారు. ఇప్పటికే బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) వెరిఫికేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నట్టు వెల్లడించారు.
మరోవైపు నకిలీ, జీరో డోర్ నెంబర్ లకు సంబంధించిన ఓటర్ జాబితాల తనిఖీ ప్రక్రియలో ఇప్పటి వరకూ 61,374 ఓట్లు సరిచేశామని రఘురామకృష్ణరాజుకు ఇచ్చిన సమాధానంలో ఎన్నికల సంఘం తెలిపింది. మిగతా 1,90,393 ఓట్లను తనిఖీ చేయాల్సి ఉందని పేర్కొంది.
ఒకే డోర్ నెంబరుపై 10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న లక్షా 57 వేల ఇళ్లకు గానూ ఇప్పటికే 21,347 గృహాలను తనిఖీ చేసినట్టు వెల్లడించారు. దొంగ ఓట్ల ఏరివేతకు పటిష్ట చర్యలు చేపట్టామని ఆ లేఖలో ఎన్నికల ప్రధాన అధికారి... ఎంపీ రఘురామకృష్ణరాజుకు వివరించారు.