Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌కు న‌గారా.. ఏపీలో 3, తెలంగాణ‌లో 3 స్థానాల‌కు ఎన్నిక‌లు

దేశ‌వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్‌ వ‌చ్చింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ మేర‌కు తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:40 AM GMT
రాజ్య‌స‌భ‌కు న‌గారా.. ఏపీలో 3, తెలంగాణ‌లో 3 స్థానాల‌కు ఎన్నిక‌లు
X

దేశ‌వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్‌ వ‌చ్చింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ మేర‌కు తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. దీని ప్ర‌కారం.. దేశ‌వ్యాప్తంగా మొత్తం 56 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు. ఇవ‌న్నీ కూడా.. అసెంబ్లీ/ విధాన స‌భ స‌భ్యులు ఎన్నుకొనేవే. రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. ఏపీలో 3 స్థానాలు, తెలంగాణ‌లో మ‌రో 3 స్థానాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్ర‌క్రియ‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేయ‌నున్నారు. అదేనెల 27న పోలింగ్ ప్ర‌క్రియ కూడా జ‌ర‌గ‌నుంది.

ఏపీలో ఖాళీ అయ్యే మూడు స్తానాల్లో వైసీపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి(ఈ ఏడాది ఏప్రిల్ 2 వ‌ర‌కు), ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న‌ సీఎం ర‌మేష్‌(ఏప్రిల్ 2), టీడీపీ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్‌(ఏప్రిల్ 2) లు వ‌చ్చే ఏప్రిల్‌2తో ప‌ద‌వులు కోల్పోనున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు సీట్లు కూడా.. అసెంబ్లీలో వైసీపీకి ఎమ్మెల్యేల బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌నేప థ్యంలో ఆ పార్టీకే ద‌క్కుతాయి. కానీ, రాజ‌కీయ వివాదాల నేప‌థ్యంలో కొంద‌రు అటు ఇటు అయిన ప‌రిస్థితిని బ‌ట్టి ఈ ఎన్నిక ట‌ఫ్ కానుంది.

ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ ముగ్గురు కూడా బీఆర్ ఎస్‌కు చెందిన నాయకులే. వీరిలోనూ జోగిన ప‌ల్లి సంతోష్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్‌కు మేన‌ల్లుడు కూడా. ఇక‌, మిగిలిన వారిలో వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, లింగ‌య్య‌యాద‌వ్‌లు ఉన్నారు. ఈ నేప‌థ‌యంలో వీరి స్థానంలో పోటీ జ‌ర‌గ‌నుంది. బీఆర్ ఎస్‌కు 34 మంది అసెంబ్లీ స‌భ్యులు ఉన్న నేప‌థ్యానికి తోడు ఎంఐఎం ఈ పార్టీకి స‌హ‌క‌రిస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి సంతోష్‌కు ఛాన్స్ చిక్కే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక‌, మిగిలిన రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌కు ద‌క్క‌నున్నాయ‌ని.. అసెంబ్లీలో బ‌లాన్ని బ‌ట్టి తెలుస్తోంది.