ఇంటి నుంచే ఓటు... వీరందరికీ అందులో చోటు!
సాధారణంగా ఇలాంటి సంఘటనలు ప్రతీ ఎన్నికల్లోనూ జరుగుతుంటాయి.. వాటికి సంబంధించిన దృశ్యాలు ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి
By: Tupaki Desk | 21 Sep 2023 6:42 AM GMTఎన్నికలు జరుగుతున్న సమయంలో బాధ్యత మరిచిన కొంతమంది బలుపు బ్యాచ్ ఇంట్లో హాలిడే ఎంజాయ్ చేస్తుంటారని.. అవకాశం, ఆరోగ్యం ఉండి కూడా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయరని.. క్యూలో నిలబడటాన్ని చిన్న చూపుగా భావిస్తుంటారేమో అని కామెంట్లు వినిపిస్తుంటాయి. మరోపక్క పండు ముసలి వాళ్లు, దివ్యాంగులు ఓటు వేయడం తమ నైతిక బాధ్యత అని భావిస్తూ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి బూత్ లకు వస్తుంటారు.
సాధారణంగా ఇలాంటి సంఘటనలు ప్రతీ ఎన్నికల్లోనూ జరుగుతుంటాయి.. వాటికి సంబంధించిన దృశ్యాలు ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. వారి కమిట్ మెంట్ కి అభినందించాలనిపిస్తుంటుంది. అయితే ఇకపై ఆ కష్టం పడొద్దని.. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
అవును... త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులతోపాటు కేంద్ర బలగాల్లో పనిచేస్తున్నవారు, పోలింగ్ ఏజెంట్లుగా ఉండేవారు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు, ఎన్నికల విధుల్లో ఉండే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది.
అయితే 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటినుంచే ఓటు వేసేందుకు ముందుగా రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో... నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఖరారైన అనంతరం అధికారులు పోస్టల్ బ్యాలెట్లను సిద్ధం చేస్తారు. ఇందులో భాగంగా ఇంటినుంచి ఓటువేసే వారికి సంబంధించి ప్రత్యేక రంగులో బ్యాలెట్ పత్రాన్ని రూపొందించనున్నారు.
కాగా... నాగార్జునసాగర్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలతోపాటు.. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే! అయితే... ఈ ప్రయత్నం ప్రయోజనకరంగా ఉండటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఈ ఏడాది చివర్లో జరిగే మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది!