ముంచుకొస్తున్న ఎన్నికలు ... ఏపీకి ఈసీ టీం ...!
ఏపీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈసారి ప్రతిపక్షాల ఆశలు ఫలించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి
By: Tupaki Desk | 17 Dec 2023 6:01 AM GMTఏపీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈసారి ప్రతిపక్షాల ఆశలు ఫలించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ముందస్తు ఎన్నికలు అంటూ విపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈ విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం అయితే ఏడాదిలోనే ఎన్నికలు అంటూ చాలా ఎక్కువ ఊహించేసుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో అయిదేళ్లూ పూర్తి చేసుకుంటోంది.
కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఈసారి ఎన్నికలు ఒక నెల రోజుల ముందుకు జరపబడ్డాయని. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో పంచుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అంటే నోటిఫికేషన్ ఈసారి తొందరగా వచ్చి ఎన్నికల డేట్ కూడా ముందుకు జరగబోతోంది అన్నది ఒక మాటగా ఉంది.
ఇది ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు అంటున్నారు. ఆ దిశగా సంకేతాలు ఉండబట్టే అన్ని పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. దానికి కారణం లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా కలసి నిర్వహించడమే. దాంతో ఏపీలో ఓటర్ల జాబితా తుది కసరత్తులో ఈసీ ఉంది అని తెలుస్తోంది.
కొత్త ఏఅడది మొదట్లోనే ఓటర్ల జాబితా ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇక ఎన్నికల ఏర్పాట్ల మీద ఈసీ ఇపుడు పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతోంది. ఈ నెల 22, 23 తేదీలలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక కీలకమైన బృందం పర్యటించబోతోంది. ఈ నెల 21న ఈసీ టీం ఏపీకి చేరుకుంటుంది.
ఆ మరుసటి రోజు అంటే 22న రాష్ట్ర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది అని అంటున్నారు. ఇక 23న విజయవాడ వేదికగా ఏపీవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల కలెక్టర్లు అలాగే ఆయా జిల్లాల పోలీసు అధికారులతో అతి ముఖ్యమైన సమావేశం కూడా ఈసీ టీం నిర్వహించనుద్ని అని అంటున్నారు. ఈ మీటింగ్ లోనే ఏపీలో ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ఖరారు అవుతుంది అని అంటున్నారు.
ఎక్కడెక్కడ సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అన్నదాని మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేస్తుంది అని అంటున్నారు. వివిధ జిల్లాలకు చెందిన ఓటర్ల జాబితాను కూడా మరోసారి పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తూంటే ఏపీకి ఎన్నికలు తరుముకుని వస్తున్నాయని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ నుంచే ఎన్నికల నగరా మోగించాలని చూస్తోంది అని అంటున్నారు. దీంతో ఎన్నికల వేడి రాజుకుంటోంది.