Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం... డెడ్ లైన్ పొడిగింపు!

ఏపీలో గతకొంతకాలంగా దొంగ ఓట్ల తొలగింపు అనేది అత్యంత చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Dec 2023 6:14 AM GMT
ఏపీలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం... డెడ్ లైన్ పొడిగింపు!
X

ఏపీలో గతకొంతకాలంగా దొంగ ఓట్ల తొలగింపు అనేది అత్యంత చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అధికార వైసీపీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు భారీస్థాయిలో ఫిర్యాదులు చేసింది. నియోజకవర్గాల వారీగా ఓట్ల తొలగింపుపై ఆధారాలతో పలు ఫిర్యాదులు చేసింది. ఇదే సమయంలో టీడీపీ సైతం ఇందులోకి ఎంటరైంది. వైసీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా ఓట్లు తొలగింపు ప్రక్రియ చేపట్టారంటుంది! ఈ సమయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఏపీలో ఓటర్ల జాబితా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓటర్ల తొలగింపు విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. ఇదే క్రమంలో తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం చాలామంది ఓటర్లు అక్కడ ఓటు తొలగించుకుని.. ఏపీలో అప్లై చేస్తున్నారని.. దీన్ని టీడీపీ వ్యూహాత్మకంగా అమలుచేస్తుందంటూ అధికార వైసీపీ కొత్త చర్చకు తెరలేపింది.

దీంతో ఈసారి తుది ఓటర్ల జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా ఫిర్యాదుల పరంపర అవిరామంగా కొనసాగుతుంది. అధికార వైసీపీ, విపక్షాలు పోటా పోటీగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో... వాస్తవానికి వచ్చే నెల 5వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్న ఈసీ... దాన్ని పొడిగించాల్సిన పరిస్థితి నెలకొందని భావిస్తుంది!

వైసీపీ, టీడీపీల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ డెడ్ లైన్ ను పొడిగించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఓటర్ల జాబితా తయారీ గడువు పొడిగించాలని ఈసీని కోరారు. ఈ నేపథ్యంలో ఈ వినతిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్ల జాబితాలో సవరణలకు ఇచ్చిన గడువును వచ్చే నెల 22 వరకూ పెంచుతూ కీలక నిర్ణయం ప్రకటించింది.

వాస్తవానికి ఏపీతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు వచ్చే నెల 5న ఓటర్ల తుది జాబితా ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది! అయితే తాజాగా ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అది కాస్తా జనవరి 22కు మారిపోయింది. ఈ మేరకు ఈ ఆరు రాష్ట్రాల సీఈవోలకు ఎన్నికల కమిషన్ సమాచారం పంపింది.

అప్పటికైనా ఈ వ్యవహారం ఫైనల్ అయిపోతే... ఈ విషయంలో మరో ఆలోచన లేకుండా అంతా సక్రమంగా సెట్ అయిపోతే... ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేసుకుంటుందని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే 2019లో జరిగిన తేదీలకు కాస్త అటు ఇటుగానే 2024 లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు.

కాగా... తెలంగాణ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఇప్పటికే ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ అధికారులతో భేటీ అయ్యి పరిస్ధితులను అంచనా వేసుకుంది. గత ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో... ప్రధానంగా ఓట్ల తొలగింపు, నమోదుపై వస్తున్న ఫిర్యాదులకు ఈసీ గడువు పెంచింది!