కశ్మీర్ కు ఎన్ని‘కళ’.. మరో 3 రాష్ట్రాలకూ మోగిన నగారా..
దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒక ఎత్తు.. జమ్ము కశ్మీర్ లో ఎన్నికలు ఒక ఎత్తు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన కశ్మీర్ లో రాజకీయాలు చాలా సున్నితం.
By: Tupaki Desk | 16 Aug 2024 10:34 AM GMTదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒక ఎత్తు.. జమ్ము కశ్మీర్ లో ఎన్నికలు ఒక ఎత్తు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన కశ్మీర్ లో రాజకీయాలు చాలా సున్నితం. రెండు ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ), రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నడుమ గతంలో ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం కశ్మీర్ కథ వేరు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370ని ఐదేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతేగాక జమ్ము కశ్మీర్, లద్దాఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది.
పదేళ్ల తర్వాత..
జమ్ముకశ్మీర్ లో పదేళ్ల కిందట 2014లో ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఎన్నికల సమయానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370 రద్దు, రెండుగా విభజన జరిగాయి. 2019న ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దయింది.అయితే, ఆ తర్వాత కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఆర్టికల్ 370 రద్దును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అంతేగాక వచ్చే సెప్టెంబరు 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కశ్మీర్ లో పర్యటించి సమీక్షించింది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో కశ్మీర్ కు ఎన్ని‘కళ’ వచ్చింది.
మరో మూడు రాష్ట్రాల్లోనూ
రాజకీయంగా దేశంలో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. నాలుగు ప్రాంతీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీలున్న ఈ రాష్ట్రంతో పాటు హరియాణా, ఝార్ఖండ్ లకూ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. కశ్మీర్ తో కలిపి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 3, హరియాణాకు నవంబరు 26 వరకు, ఝార్ఖండ్ కు జనవరి వరకు గడువుంది. అయితే, వీటి అన్నిటికీ కశ్మీర్ తో కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు.
హరియాణాలో అక్టోబరు 1న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 4న ఫలితాలు వెల్లడిస్తారు. కశ్మీర్ లో 90 అసెంబ్లీ సీట్లున్నాయి. 2018లో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. సెప్టెంబర్ 18 (24 స్థానాలకు), 25న (26 స్థానాలకు), అక్టోబర్ 1న (40 స్థానాలకు) పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఫలితాల వెల్లడి.