పొలిటికల్ యాడ్స్ రద్దు ?
ఎన్నికలంటేనే ప్రకటనల హోరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
By: Tupaki Desk | 12 Nov 2023 4:00 PM ISTఎన్నికలంటేనే ప్రకటనల హోరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఇచ్చుకునే అడ్వర్టైమెంట్లు కాకుండా మొత్తం రాష్ట్రమంతా వచ్చేట్లుగా పార్టీలు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటాయి. అభ్యర్ధులు ఇచ్చుకునే ప్రకటనలు తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. అదే పార్టీలు ఇచ్చే ప్రకటనలు అభ్యర్ధులను దృష్టిలో పెట్టుకుని కాకుండా హోలు మొత్తం పార్టీని దృష్టిలో పెట్టుకుని ఇస్తాయి. ఇపుడిదంతా ఎందుకంటే వివిధ రాజకీయపార్టీల తరపున ప్రసారమవుతున్న 15 ప్రకటనలను ఎన్నికల కమీషన్ రద్దు చేయబోతున్నది.
ఈ ప్రకటనలు ఎన్నికల కమీషన్ నియమ, నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వెంటనే వాటిని నిలిపేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ 15 ప్రకటనలూ టీవీల్లోనే ప్రసారమవుతున్నాయి. వీటిల్లో కూడా కాంగ్రెస్ తరపున తొమ్మిది, బీజేపీ తరపున ఐదు, బీఆర్ఎస్ తరపున ఒక్క అడ్విర్టైజ్మెంట్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా కేసీయార్, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ రూపొందించిన ప్రకటనలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
కేసీయార్ ను టార్గెట్ చేస్తు కారు గుర్తుపై కాంగ్రెస్ అనేక రకాలైన ప్రకటనలను రెడీచేసింది. కేసీయార్ ప్రకటనలను జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు, కారు టైర్లను పంక్చర్ చేస్తున్నట్లు, బీఆర్ఎస్ ను జనాలు తరిమికొడుతున్నట్లు ప్రకటనల్లో కనబడుతున్నాయి. కొత్త తరహాలో కనబడుతున్న ప్రకటనలు జనాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కేసీయార్ ను పోలిన మనుషులనే ప్రకటనల్లో కాంగ్రెస్ చూపించింది. దాంతో బీఆర్ఎస్ నుండి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేసీయార్ ను వ్యక్తిగతంగా కాంగ్రెస్ టార్గెట్ చేసి బురదచల్లుతోందనే ఆరోపణలు వచ్చాయి.
వివిధ పార్టీలపై తనకు అందిన ఫిర్యాదులను సమీక్షించిన ఎన్నికల కమీషన్ మొత్తం 15 ప్రకటనలను తాత్కాలికంగా వెంటనే నిలిపేయాలని టీవీ చానళ్ళు, ప్రింట్ మీడియాకు ఆదేశాలు జారీచేసింది. తాము తదుపరి సమాచారం ఇచ్చేంతవరకు ఈ ప్రకటనలను ప్రసారం చేయకూడదని, ప్రచురించవద్దని కమీషన్ మీడియా హౌసులను ఆదేశించింది. తమ దగ్గర అనుమతులు తీసుకున్న ప్రకటనలకు తర్వాత మార్పులు చేర్పులు చేసి పార్టీలు ప్రకటనలు జారీ చేసినట్లు కమీషన్ గుర్తించింది. అందుకనే వెంటనే నిలిపేయాలనే ఆదేశాలను జారీచేసింది.