నాయకులకు 'గోల్డెన్ డేస్' మిస్ చేస్తున్న ఈసీ ??
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగేందుకు.. మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది
By: Tupaki Desk | 22 April 2024 11:30 PM GMTరాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగేందుకు.. మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. మరో నాలుగు రోజులు నామినేషన్ల పర్వం ఉంది. ఆ తర్వాత.. ఒక రోజు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత.. పూర్తిస్థాయిలో నాయకులు, అభ్యర్థులు, పార్టీలకు మిగిలేది 15 రోజులు మాత్రమే. ఈ పదిహేను రోజులు కూడా పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు. ఇక, ఆ 15 రోజులు మాత్రం గోల్డెన్ డేస్.
దీంతో వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల వరకు కూడా. ఈ 15 రోజుల గోల్డెన్ డేస్ పైనే ఎక్కువగా ఆశలు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను మార్చేయాలన్నా.. ఓటర్ల నాడిని మేలిమలుపు తిప్పాలన్నా.. ఈ 15 రోజులు అత్యంత కీలకం. అందుకే నాయకులు ప్రచారంలో దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారాన్ని మరింత ఊపు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే. వైసీపీ అధినేత ఈ నెల ఆఖరుతో బస్సు యాత్రను పూర్తి చేసి...(మరో మూడు జిల్లాలు మాత్రమే మిగిలాయి) ఆ వెంటనే సుడిగాలి పర్యటనలకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు, పవన్‌లు కూడా.. సుడిగాలి పర్యటనలకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. దీనికిగాను సీఎం జగన్ రెండు హెలికాప్టర్లు రెడీ చేసుకున్నారు. ఒకటి విజయవాడలో ఉంది. రెండోదివిశాఖలో ఉంది. ఇక, చంద్రబాబు ఒక హెలికాప్టర్‌కు అడ్వాన్సును గత నెల్లోనే కట్టారు. పవన్ కూడా.. హెలికాప్టర్‌ను బుక్ చేసుకున్నారు.
చివరి 10 రోజులు వరుస పెట్టి హెలికాప్టర్లలోనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి రావల్సి ఉంది. వైసీపీ అధినేత నుంచి.. టీడీపీ, జనసేన అధినేతలు కూడా అనుమతి కోరుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి గత వారంలోనే దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ఈసీ నుంచి ఎలాంటి సంకేతాలూ రాలేదు. ఇచ్చే ఉద్దేశం కూడా ఉన్నట్టు కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో కీలకమైన గోల్డెన్ డేస్‌లో ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తిగామారింది.