సూరత్ అలా .. పాలమూరు ఇలా !
దేశవ్యాప్తంగా భారతదేశ భవిష్యత్ ను నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి
By: Tupaki Desk | 24 April 2024 12:30 AM GMTదేశవ్యాప్తంగా భారతదేశ భవిష్యత్ ను నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 400 పై చిలుకు లోక్ సభ స్థానంలో సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని, మూడోసారి నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావడం లాంఛనప్రాయమేనని ఎన్డీఎ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో మోడీ హవా తగ్గిందని, ఈసారి ఇండియా కూటమి విజయం ఖాయం అని, దేశంలో ప్రజల మధ్యన విభేదాలు సృష్టించి అధికారం కోసం మోడీ ఆరాటపడుతున్నాడని, ఈసారి రాహుల్ ప్రధాని కావడం ఖాయం అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయాలను కాసేపు పక్కనపెడితే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎంపికకు ఎన్నికలు జరిగాయి. దీంతో కాంగ్రెస్ తరపున పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డిలు పోటీ పడ్డారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో బీఆర్ఎస్ కు ఎనిమిది వందల పైచిలుకు, కాంగ్రెస్ కు నాలుగు వందల పై చిలుకు, ఇతరులతో కలుపుకుని మొత్తం 1400 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికలలలో గెలుపు కోసం రెండు పార్టీలు క్యాంపు రాజకీయాలు నిర్వహించి ఒకరు కేరళ, ఒకరు గోవాకు ఓటర్లను తరలించి వారికి ఖరీదైన కానుకలు, నగదు ఇచ్చి సంతృప్తి పరిచారు. తీరా మార్చి 28న ఓటింగ్ పూర్తయ్యాక లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉన్న కారణంగా ఈ ఫలితం ప్రభావం చూపుతుందని లెక్కింపును జూన్ 2కు వాయిదా వేశారు.
అయితే నిన్న సూరత్ లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అక్కడి నుండి బీజేపీ తరపున ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమీషన్ గెలుపు పత్రం అందజేసింది. మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నిక ఓటింగ్ మీద ప్రభావం చూపుతుందని ఓట్ల లెక్కింపు నిలిపేసిన ఎన్నికల కమీషన్ సూరత్ గెలుపును ఎలా ప్రకటిస్తుంది అన్న వాదన మొదలయింది. మరి ఆ ఎన్నిక ఫలితాలపై ప్రభావం చూపనప్పుడు ఈ ఎన్నిక ఎందుకు ప్రభావం చూపుతుంది అన్నది లాజిక్కు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.