Begin typing your search above and press return to search.

గెలిపించేది ఎలక్షనీరింగ్ మాత్రమే...!

మరి ఎలా గెలుపు సాధ్యం, దీని వెనక ఎవరికి ఏఏ వ్యూహాలు ఉన్నాయన్నది చూస్తే కనుక ఎలక్షనీరింగ్ అన్న మాట వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   6 March 2024 4:43 AM GMT
గెలిపించేది ఎలక్షనీరింగ్ మాత్రమే...!
X

ఏపీలో ఎవరు విజేతలు అన్నది జనంలో చర్చ ఉంది. రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ ఉంది. టీవీలలో డిబేట్లు జరుగుతున్నాయి. ఇక సర్వేశ్వరులు అయితే పూటకో సర్వే తలో పార్టీ తరఫున ఇస్తున్నారు. వీటిని నమ్ముతున్నారా అంటే ఏ పార్టీకి ఆ పార్టీ తామే గెలుస్తుంది అంటే నమ్ముతుంది. లేదు అంటే అది తప్పుడు సర్వే అని అంటోంది.

మరి ఏపీలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అన్నది చూస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అని కొన్ని ఉంటాయి. వాటిని చూసినపుడు ఏ పార్టీ తక్కువ తినలేదు అనే అనిపిస్తుంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ రెండూ బలంగానే ఉన్నాయి. రెండు వైపులా క్యాడర్ ఉంది. అది కూడా పంచాయతీల దాకా పాతుకుని పోయింది.

ఇక ఎన్నికల్లో రెండు పార్టీల ఎత్తులు జిత్తులు అన్నీ సమపాళ్లలోనే ఉంటాయి. ఎవరూ ఎక్కడా తక్కువ తినడలేదు. ఎవరూ కూడా ఓటమిని అంగీకరించే సమస్య లేనే లేదు. ఇది రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యగానే ఉంది. గెలుపు అనివార్యం అన్నది వైసీపీకి తెలుసు టీడీపీకి తెలుసు.

ఇక రెండు పార్టీలలో ధీమా చాలా ఎక్కువగానే ఉంది. రెండు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది అని ప్రతీ సభలో చంద్రబాబు చెబుతున్నారు. అలాగే నారా లోకేష్ కూడా ఇదే చెబుతున్నారు. ఇక వైసీపీ కూడా మళ్లీ వచ్చేది మనమే అంటోంది. దానికి పరాకాష్ట అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు అయ్యాక రెండవ సారి సీఎం గా విశాఖ నుంచే ప్రమాణం చేస్తాను అని కూడా ఒక సంచలన ప్రకటన చేశారు.

దీనిని బట్టి చూస్తే నూరు శాతం ఆశలు రెండు పార్టీలలో ఉన్నాయి. పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎవరికీ డౌట్ అన్నదే లేదు అని అంటున్నారు. మరి ఎలా గెలుపు సాధ్యం, దీని వెనక ఎవరికి ఏఏ వ్యూహాలు ఉన్నాయన్నది చూస్తే కనుక ఎలక్షనీరింగ్ అన్న మాట వినిపిస్తుంది. ఎన్నికల్లో అదే ముఖ్యం. సభలకు జనాలు వస్తారో తెస్తారో అవన్నీ కూడా ఒక సినిమా విడుదలకు ముందు చేసే ప్రచారంలో భాగంగానే ఉంటాయి.

ఒక విధంగా చూస్తే ఆత్మ సంతృప్తి కోసం చేసే పనులే ఇవన్నీ. అసలు కధ అసలైన సినిమా ఒకే ఒక్క రోజున ఉంటుంది. అదే పోలింగ్ డే. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో ఈవీఎం లలో ఎవరికి ఓటు పడితే వారే కింగ్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిదే రాజ్యం. మరి ఓట్లు ఎలా వేయించుకోవాలి.

అభిమానం ఉన్న వారు గడప దాటేలా చేయాలి. వారిని పోలింగ్ బూతులకు తెచ్చి ఓట్లు అన్నీ ఒక్కటి కూడా పొల్లు పోకుండా వేయించుకోవాలి. ఇక్కడితో కధ అయిపోతుందా అవదు కాక అవదు. అవతల పక్షం ఓట్లు ఎక్కువ పోల్ కాకుండా చూసుకోవాలి. దాన్నే అసలైన ఎలక్షనీరింగ్ అని అంటారు.

అంటే మన ఓట్లు నిండుగా పడాలి. ఎదుటి పక్షం ఓట్లు తగ్గిపోవాలి. ఇలా చేయడమే విజయం కోసం పన్నే అసలైన పద్మ వ్యూహం మరి. ఇది సాధ్యపడాలీ అంటే ఎన్నికల నాడు చేయాల్సినవి అన్నీ చేయాలి. ఏపీలో వైసీపీ విషయం తీసుకుంటే 2019లో బలమైన వేవ్ వీచింది. అధికారం దక్కింది. ఇక లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వస్తే అధికారంలో ఉంటూ జరిపించిన ఎన్నికలు నూటికి తొంబై శాతం విజయాలు వైసీపీకి దక్కాయి. అంటే ఎలక్షనీరింగ్ అదుర్స్ అన్న మాట.

అదే విధానాన్ని ఇపుడు సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. టీడీపీ విపక్షంలో ఉంది. జనసేనతో జట్టు కట్టింది. రెండూ కలిస్తే పోలింగ్ బూత్ లలో అధికార పక్షాన్ని కట్టడి చేయగలవు. వీటికి తోడుగా బీజేపీ వస్తేనే విపక్ష కూటమికి కొండంత బలం వస్తుంది. అపుడే వైసీపీని బలంగా ఢీ కొట్ట గలుగుతుంది. అందుకే పొత్తుల కోసం ఎదురు చూపులు. ఆ విషయం తెలిసే బీజేపీ కూడా బెట్టు చేస్తోంది.

మొత్తానికి చూస్తే బీజేపీ మద్దతు అన్నది తులసీదళం బరువులా ఉంది అన్న మాట. అలాగే శ్రీకృష్ణ పాత్రధారిగా ఏపీ సంగ్రామంలో తన పాత్ర నిర్వర్తించాల్సి ఉంది అన్న మాట. ఇదిలా ఉంటే ఎలక్షనీరింగ్ కి సర్వం సిద్ధం చేసుకుంది వైసీపీ అన్నది గట్టిగా వినిపిస్తున్న టాక్.