ఎన్నికల ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందేనా?
ఎన్నికల వేళ అభ్యర్థుల ఖర్చులు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం వాటి విలువ రెట్టింపవుతోంది.
By: Tupaki Desk | 2 May 2024 1:30 PM GMTఎన్నికల వేళ అభ్యర్థుల ఖర్చులు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం వాటి విలువ రెట్టింపవుతోంది. ఈసారి ఎండలు కూడా వేడిగానే ఉన్నాయి. అభ్యర్థుల ఖర్చు కూడా అంతకన్నా వేడిగా ఉంటోంది. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా లోక్ సభకు పోటీ చేసే వారికి కనీసం ఖర్చు రూ. కోట్లలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కొందరు పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి ఐదేళ్లకు కనీసం 50 శాతం నుంచి 100 శాతానికి పైగా ఖర్చు పెరుగుతోంది. 2019లో ఒక్కో ఎంపీ అభ్యర్థి రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. 2014తో పోల్చితే ఇది 25 శాతం అధికం. 2019 లోక్ సభలో 474 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ. కోటి కంటే ఎక్కువే. 2009లో రూ. 30 లక్షలు, 2014లో రూ.40లక్షలుగా అయింది. అప్పుడు ఎన్నికల సంఘం విధించిన పరిమితి రూ. 95 లక్షలు.
2014 ఎన్నికల్లో పార్టీల డిక్లరేషన్ ప్రకారం బీజేపీ రూ. 755 కోట్లు, కాంగ్రెస్ రూ.488 కోట్లు ఖర్చు చేసింది. 2019 ఎన్నికల నాటి ఖర్చు ఇప్పుడు బద్ధలయ్యే అవకాశముంది. గత ఇరవై ఏళ్లలో ఎన్నికల వ్యయం బాగా పెరిగిపోయింది. సుమారు 500 శాతం పెరిగినట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. 1999లో రూ. 10 వేల కోట్లు కాగా 2019 నాటికి రూ. 55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు పెరిగింది.
1951లో ఒక్కో ఎంపీ 8 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం అది 20 లక్షలకు పెరిగింది. 1970 నుంచి పార్లమెంట్ స్థానాల్లో స్థిరత్వం లేకుండా పోయింది. దీంతో అభ్యర్థుల ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. చేతి ఖర్చులు, పోస్టర్లు, స్పీకర్లు, వాహనాలు, భోజనాలు ఇలా చెబితే డబ్బు ఏ మూలకు సరిపోవడం లేదనేది అభ్యర్థుల వాదన.
ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. మీడియా కోసం బాగానే ఖర్చు చేస్తున్నారు. ఫేస్ బుక్ ప్రకటనల కోసం బీజేపీ రూ. 6 కోట్ల ప్రకటనలు ఇచ్చింది. కాంగ్రెస్ రూ. 1.45 కోట్లు వెచ్చించింది. 2024లో దేశంలో సుమారు 36 వేల కోట్ల మంది ఫేస్ బుక్ వాడుతున్నట్లు తెలుస్తోంది. వారిని చేరడానికి పార్టీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.