ఎలక్షన్ కింగ్: ఓడామా గెలిచామా కాదన్నయ్య.. పోటీ చేశామా లేదా?
అవును... విక్రమార్కుడు, గజనీ మహ్మద్ మొదలైన వారి కోవకే చెందినట్లుగా చెప్పబడే తమిళనాడుకు చెందిన పద్మరాజన్ కి పెద్ద చరిత్రే ఉంది.
By: Tupaki Desk | 28 March 2024 4:30 PM GMTఎవరైనా ఏదైనా పని పెట్టుకుంటే అది సాధించే వరకూ వదిలిపెట్టరు. ఇలాంటి వాళ్లను పట్టువదలని విక్రమార్కులు అంటారు! ఇక మరికొంతమంది ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతుంటే... వారిని గజనీ మహ్మద్ దండయాత్రతో పోలుస్తుంటారు. భారత్ పై 17సార్లు దండెత్తి ఓడిపోయినా కూడా చివరికి గెలిచి చరిత్రలో నిలిచాడని. ఈ టైపులోనే కలెక్షన్ కింగ్ బిరుదాంకితుడు అయిన పద్మరాజన్ కి కూడా ఒక చరిత్ర ఉంది. ఆయన ఇప్పటివరకూ 238 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు!
అవును... విక్రమార్కుడు, గజనీ మహ్మద్ మొదలైన వారి కోవకే చెందినట్లుగా చెప్పబడే తమిళనాడుకు చెందిన పద్మరాజన్ కి పెద్ద చరిత్రే ఉంది. ఇందులో భాగంగా... గత 35 సంవత్సరాలుగా ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యాడు. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. డిపాజిట్ కోల్పోయినా డోంట్ కేర్... తనకు తానే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పుకుని ముందుకు సాగిపోతుంటాడు.
వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని మెట్టూరుకు చెందిన 65 ఏళ్ల పద్మరాజన్... పంక్చర్ షాపు నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఈ క్రమంలో... సర్పంచ్ నుంచి రాష్ట్రపతి ఎన్నికలవరకూ అన్నింటిలోనూ పోటీ చేస్తుంటారు. నోటిఫికేషన్ పడటం ఆలస్యం... నామినేషన్ దాఖలు చేసేస్తుంటారు. ఇది నిన్నా మొన్నా మొదలైన పోరాటం కాదు.. 1988 నుంచి జరుగుతున్న అలుపెరగని యుద్ధం!!
ఈ వ్యవహారంపై స్పందించిన పద్మరాజన్... జనం నవ్వుకున్నా కానీ, ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో పాల్గొనగలడని, సాధించగలడని నిరూపించాలనేదే తన ప్రయత్నం అని అంటుంటారంట! ఇదే సమయంలో... ఎన్నికల్లో పోటీ చేయడమే తన విజయమని, ఓటమి అనివార్యంగా వచ్చినప్పుడు ఓడిపోయేందుకు సంతోషమే అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏది ఏమైనా... ఈ ఎలక్షన్ కింగ్ ఈ విషయంలో మాత్రం చాలామందికి ఆదర్శప్రాయుడనే అనుకోవాలి!!
ఈ క్రమంలో... లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ వేశారు పద్మరాజన్. ఈయన కొన్నేళ్లుగా ప్రధాని మోడీ, మాజీ ప్రధాని వాజపేయి, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల చేతిలో ఓడిపోయిన చరిత్ర ఈయన సొంతం.