Begin typing your search above and press return to search.

తినబోతూ రుచి అడగడం ఎందుకు ఏపీ ప్రజలారా?... ఇంకో 5 రోజులే!

అవును... ఏపీలో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల్లో వందల సంఖ్యలో కేసులు నమోదైన పరిస్థితి. ఇందులో నేతలు హైకోర్టులకు వెళ్లి, లక్షలు ఖర్చుపెట్టుకుని, బెయిల్స్ తెచ్చుకున్నారు, బయటకు వచ్చేశారు.

By:  Tupaki Desk   |   31 May 2024 3:54 AM GMT
తినబోతూ రుచి అడగడం ఎందుకు ఏపీ ప్రజలారా?...  ఇంకో 5 రోజులే!
X

మునుపెన్నడూ లేనివిధంగా అన్నట్లుగా ఏపీలో రాజకీయం ఈసారి ఎన్నికల వేళ అత్యంత రసవత్తరంగా మారిపోయింది. ఇందులో పలు ప్రచార కార్యక్రమాలు సరికొత్త రికార్డులు సృష్టించాయని అంటున్నారు. ప్రచార కార్యక్రమాల సంగతి అలా ఉంటే... ఇక ప్రధాన పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలను ప్రజలు ఏ మేరకు నమ్ముతారు అనేది అత్యంత కీలకంగా మారింది.

ఈ క్రమంలోనే మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పలు అవాంఛనీయ సంఘటనలు రాజకీయ వాతావరణ పరిస్థితికి అద్దంపట్టాయని అంటున్నారు. దీంతో... ఫలితాల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులకు, ఏజెంట్లకూ పలు హెచ్చరికలు జారీ చేసింది.

ఆ సంగతి అలా ఉంటే... ఈ లోపు బెట్టింగులు, పంతాలు, పట్టింపులు పెరిగిపోతున్నాయి. వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారా.. కూటమిని ప్రజలు ఆదరిస్తారా.. పిఠాపురంలో పవన్ గెలుస్తారా.. మంగళగిరిలో చినబాబు పరిస్థితి ఏమిటి.. ఇలాంటి హాట్ హాట్ ప్రశ్నలన్నింటికీ జూన్ 4న సమాధానం రాబోతుంది. ఈ సందర్భంగా ప్రధానంగా యువతకు పలు సూచనలు చేస్తున్నారు పరిశీలకులు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఐదు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 4 మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే... ఈ సమయంలో తిట్టుకుని, కొట్టుకుని, కేసులు పెట్టించుకు, ఫలితంగా లైఫ్ ని నాశనం చేసుకుని ఇబ్బందులు పడటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు.

అవును... ఏపీలో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల్లో వందల సంఖ్యలో కేసులు నమోదైన పరిస్థితి. ఇందులో నేతలు హైకోర్టులకు వెళ్లి, లక్షలు ఖర్చుపెట్టుకుని, బెయిల్స్ తెచ్చుకున్నారు, బయటకు వచ్చేశారు. కానీ.. ఆ గొడవల్లో చిక్కుకున్న సామాన్య కార్యకర్తలు మాత్రం జైల్లలోనే మగ్గుతున్న పరిస్థితి. ఫలితాల వస్తున్న వేళ ప్రధానంగా యువత ఎటువంటి ఆగ్రహావేశాలకూ, అత్యుత్సాహాలకూ లోను కాకుండా ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. కామన్ మ్యాన్ గా ఎవరి లైఫ్ వారిదే. ఐదో తేదీ నుంచి ఎవరి జీవితాలు వాళ్లవే. తాము అభిమానించే నాయకుడు ఓడిపోయాడని అల్లర్లు చేయడం.. గెలిచాడని అత్యుత్సాహం ప్రదర్శించి రచ్చ చేయడం వంటివి చేయడం వల్ల ఈసీ కేసులు బుక్ చేయడం కన్ ఫాం! జీవితంలో ఒకసారి కేసు పడితే... అది లైఫ్ మొత్తం వెంటాడుతుందనే విషయాన్ని సదరు యువత మరిచిపోకూడదు.

ప్రధానంగా యువత గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గెలిచిన పార్టీలు నెరవేర్చని పక్షంలో నిలదీయడానికి తమ శక్తిని ఉపయోగించాలే తప్ప.. తమ నాయకుడు గెలవలేదనే ఆక్రోశంతోనో, ఆగ్రహంతోనో కేసులు పెట్టించుకోవడం వల్ల లైఫ్ లు పోతాయనే విషయం గ్రహించాలని సూచిస్తున్నారు పరిశీలకులు. యువత ఈ సూచనలు పాటించాలని కోరుకుంటున్నారు.