Begin typing your search above and press return to search.

లెక్క తేల్చారు !

By:  Tupaki Desk   |   4 Jun 2024 1:39 AM GMT
లెక్క తేల్చారు !
X

ఈవీఎం ఫలితాలు చాలా మంది జాతకాలను తేల్చనున్నాయి. సెఫాలజిస్టుల నుంచి ఆధ్యాత్మిక పండితుల నుంచి జోతీష్య పండితుల దాకా ఎవరికి వారుగా చెప్పిన మాటలు చేసిన వ్యాఖ్యానాలలో పస ఎంత ఉందో ఎగ్జాక్ట్ పోల్స్ తేల్చేస్తున్నాయి. కొందరికి రాజకీయ సన్యాసం పట్టించనున్నాయి. మరి కొందరిని పూర్తిగా వారి వృత్తుల నుంచి తప్పించనున్నాయి. ఇంకొందరు ఆయా వృత్తులలో కొనసాగినా మునుపటి పలుకుబడి లేకుండా ఖేల్ ఖతం చేయనున్నాయి.

ప్రజల తీర్పు ఇది. కడు భయంకరంగా ఉంటుంది. దానికి ఎవరి మీద ఆపేక్ష ఉండదు, ఎవరి మీద జాలి సానుభూతి అంతకంటే ఉండదు, తీర్పు నిష్పక్షపాతంగా జనం ఇచ్చేశారు. దాని లోతుపాతులను చూసుకుని ఎవరి మాటుకు వారు ఎవరి బుర్రలకు వారు తోచిన విధంగా విశ్లేషించుకోవడమే ఇక మిగిలింది.

జనం ఇచ్చిన తీర్పులో మంచి చెడులను బేరీజు వేసుకుని తాము ఏ మార్గంలో అయితే జనాల మన్నన పొందుతామన్నది గ్రహించి ఆ దిశగా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు సెఫాలజిస్టులకు జోస్యాలు చెప్పేవారికి ఇలా వివిధ రంగాలలో ఉన్న వారికీ వర్తిస్తుంది.

ప్రజలతో కూడినది రాజకీయం ప్రజలు అంటే నిత్య నూతన తరంగం, వారు ఎపుడూ శతకోటి ఆలోచనలతో కదిలే సమూహాలు లాంటి వారు. వారిని పట్టుకుని ఆకట్టుకుని నెట్టుకు రావడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎవరి చేతిలోనూ మంత్ర దండం లేదు. ఒకవేళ ఉన్నా ఆ మంత్ర దండానికి మంత్ర ముగ్దులు అయి వశపడిపోయే బాపతు జనాభా ఈ ఆధునిక యుగంలో లేరంటే లేరు.

ఎన్నిక ఎన్నినకూ జనం చైతన్యవంతులు అవుతున్నారు. అది ఎన్నో రెట్లు ప్రజా తీర్పుని ప్రభావితం చేస్తోంది. అందువల్ల తీర్పు ఇలాగే ఉండొచ్చు అని రొటీన్ రొడ్డకొట్టుడు విధానంలో మూస పోసిన పద్ధతులలో బుర్రలకు ఆలోచనలు ఎక్కిస్తూ అవే నిజమని భ్రమిస్తూ సాగిపోయే వారికి ప్రతీ ప్రజా తీర్పూ ఒక గుణపాఠమే అవుతుంది. ఈసారి కూడా ఏపీలో నరాలు తెగేటంతగా ఉత్కంఠను రేపుతూ ఎన్నికలు జరిగాయి.

జనాలు అందరి సభలకూ వచ్చారు. అందరు చెప్పినదీ విన్నారు. తమకు తోచినది ఏపీకి ఏది బాగుగా సబబుగా ఉంటుంది అనుకున్నదే వారి భావించి తీర్పు ఇచ్చారు. దానిని ఎవరైనా శిరోధార్యంగా భావించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అందువల్ల వారి విషయంలో రెండవ మాటకు తావు లేనే లేదు. వారి మాటే శాసనం. ఆ శాసనాన్ని మన్నించి సమాదరించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ పోతేనే ఎవరికైనా వృద్ధి అభివృద్ధి. అదే ప్రజా తీర్పులో దాగున్న అసలైన స్పూర్తి.